ఆ వాయిస్‌ నాదే.. చాట్‌జీపీటీకి హాలీవుడ్‌ నటి లీగల్‌ నోటీసు

Scarlett Johansson: హాలీవుడ్‌ నటి స్కార్లెట్ జాన్సన్ చాట్‌జీపీటీపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఎందుకో తెలుసా?

Published : 22 May 2024 00:05 IST

Scarlett Johansson | ఇంటర్నెట్‌డెస్క్‌: చాట్‌జీపీటీ (ChatGPT).. మార్కెట్‌లోకి అడుగుపెట్టగానే సంచనాలు సృష్టించిన ఈ సాంకేతికత అదే సమయంలో పెద్దఎత్తున వివాదాల్లో చిక్కుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారంటూ చాలా కాలం నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. అనుమతి తీసుకోకుండానే తాము రాసిన పుస్తకాలపై చాట్‌జీపీటీ (ChatGPT) శిక్షణ పొందిందని ఓపెన్‌ఏఐ (OpenAI)పై ఇప్పటికే కొందరు రచయితలు ఆరోపించారు. తాజాగా తన వాయిస్‌నే వినియోగించిందంటూ ఓ హాలీవుడ్‌ నటి ఏకంగా చట్టపరమైన చర్యలకు దిగింది. చివరకు చాట్‌జీపీటీ ఆ వాయిస్‌ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

కొత్త వాయిస్‌ సామర్థ్యాలతో ఓపెన్‌ ఏఐ ఇటీవల ChatGPT 4oని ప్రవేశపెట్టింది. వాటిని బాగా ప్రచారం చేసింది. ఇందులో ఐదు విభిన్న స్వరాలను పరిచయం చేసింది. వాటిలో ‘‘స్కై(Sky)’’ కూడా ఒకటి. జాన్సన్‌ స్నేహితులు, కుటుంబసభ్యలు ChatGPT 4o స్కై (వాయిస్‌ అసిస్టెంట్‌)ను ఉపయోగిస్తున్న సమయంలో ఓ పోలికను గమనించారు. స్కై వాయిస్‌ అచ్చం జాన్సస్‌ మాటలానే అనిపించిందట. ఈ విషయాన్ని ఆమెకు తెలిపారు. ‘‘స్కై వాయిస్‌ని విని నేను షాకయ్యా! నా స్నేహితులు అందులో ఎటువంటి తేడాను గుర్తించలేకపోయారు’’ అని చెప్పింది.

ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్‌ సీటీఓ సూచనలు

చాట్‌జీపీటీ 4o చాట్‌బాట్‌ కోసం తన వాయిస్‌ని ఉపయోగించారని హాలీవుడ్‌ నటి స్కార్లెట్ జాన్సన్ ఆరోపించింది. చాట్‌బాట్‌ కోసం తన వాయిస్‌ని ఇవ్వాలని కంపెనీ ఈసీఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ జాన్సన్‌ను సెప్టెంబరులోనే సంప్రదించారని.. కానీ ఆ అభ్యర్థనను తిరస్కరించినట్లు పేర్కొంది. దీంతో న్యాయపరమైన చర్యలకు దిగింది. దీంతో వాయిస్‌ క్రియేషన్‌పై వివరణ ఇస్తూ ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ఆల్ట్‌మన్‌ రెండు లేఖలు పంపారు. స్కై వాయిస్‌ జాన్సన్‌ది కాదని ప్రొఫెషనల్‌ యాక్టర్‌ నుంచి ఆ స్వరాన్ని రికార్డింగ్‌ చేసినట్లు తెలిపారు. అయితే గోప్యతా కారణాల వల్ల ఆ నటి వివరాలు వెల్లడించలేమన్నారు.

‘‘ స్కై కోసం వేరే యాక్టర్‌ స్వరాన్ని తీసుకున్నాం. ఆమె స్వరాన్ని పోలి ఉండాలనే ఉద్దేశంతో చేయలేదు. జాన్సన్‌పై గౌరవంతో మా ఉత్పత్తుల్లో  స్కై వాయిస్‌ని ఉపయోగించడం ఆపేశాం. విషయాన్ని ఆమెకు స్పష్టంగా తెలపడంలో మేం విఫలమయ్యాం’’ అని ఆ లేఖలో వివరించినట్లు ఆమె తెలిపారు. అయిష్టంగానే తన వాయిస్‌ని తొలగించారన్నారు. డీప్‌ఫేక్‌లు, AI యుగంలో పారదర్శకత, వ్యక్తిగత హక్కుల రక్షణ ఉండటం చాలా ముఖ్యమన్నారు. ఏఐపై నియంత్రణ తెచ్చేందుకు చట్టాన్ని రూపొందించాలని ఆమె కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని