Stock market: ఒకే రోజు 2 కొత్త రికార్డులు.. తొలిసారి 74,700 ఎగువన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 494, నిఫ్టీ 152 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Updated : 08 Apr 2024 18:09 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. ప్రపంచ మార్కెట్లపై ఆశావహ దృక్పథం, విదేశీ కొనుగోళ్లు మన సూచీలకు కలిసొచ్చింది. ముఖ్యంగా రిలయన్స్‌, ఎల్‌అండ్‌టీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో సూచీలు భారీగా లాభపడ్డాయి.

ఈ క్రమంలోనే మార్కెట్లలో రెండు సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఇంట్రాడేలో 74,869.3 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకిన సూచీ.. కాస్త క్షీణించినప్పటికీ తొలిసారి 74,700 ఎగువన ముగిసింది. అలాగే, మదుపరుల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీ మొత్తం విలువ సైతం తొలిసారి రూ.400 లక్షల కోట్లు దాటింది. అటు నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 22,700 మార్కును దాటి చివరికి 22,650 ఎగువన స్థిరపడింది.

‘అమృత్‌ కలశ్‌’ గడువు మరోసారి పెంపు.. ఎప్పటి వరకంటే?

సెన్సెక్స్‌ ఉదయం 74,555.44 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా కొనుగోళ్ల సందడితో అదే ఒరవడి కొనసాగింది. ఓ దశలో 600 పాయింట్ల మేర లాభపడిన సూచీ.. చివరికి 494.28 పాయింట్ల లాభంతో 74,742.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 152.60 పాయింట్లు లాభపడి 22,666.30 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.31గా ఉంది.

సెన్సెక్స్‌లో మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. నెస్లే ఇండియా, విప్రో, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, టైటాన్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ రకం బ్యారెల్‌ చమురు ధర 90.34 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2355 డాలర్ల స్థాయికి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని