Mobile Apps: మీరు డౌన్‌లోడ్‌ చేసే యాప్స్‌ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..

Mobile Apps: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కచ్చితంగా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు యాప్ స్టోర్‌, గోప్యతా విధానాలు, డేటా సేకరణ, సమీక్షలు, మానిటైజేషన్ పద్ధతులు, వివిధ అనుమతుల వంటి అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.

Published : 20 May 2024 00:03 IST

Mobile Apps | ఇంటర్నెట్‌ డెస్క్‌: వివిధ అవసరాలరీత్యా స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు రకరకాల యాప్స్‌ను (Mobile Apps) డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి వస్తుంటుంది. ఈ క్రమంలో యూజర్లు సెక్యూరిటీని కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి. లేదంటే సైబర్‌ మోసాలు అధికమవుతున్న ఈ తరుణంలో కీలక సమాచారాన్ని మోసగాళ్ల చేతిలో పెట్టినట్లవుతుంది. డౌన్‌లోడ్‌ చేసుకోబోయే ముందు ఆ యాప్‌ సురక్షితమా? కాదా? తెలుసుకునేందుకు కొన్ని టిప్స్‌ను చూద్దాం..

థర్డ్‌ పార్టీ యాప్‌ స్టోర్లు వద్దు..

సురక్షితమైన యాప్‌ల కోసం ఆండ్రాయిడ్‌ గూగుల్‌ ప్లే, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ వంటి అధికారిక స్టోర్లను మాత్రమే ఉపయోగించాలి. యాప్‌లను యూజర్లకు అందుబాటులో ఉంచడానికి ముందే ఈ స్టోర్లు వాటిని క్షుణ్నంగా తనిఖీ చేస్తాయి. యూజర్ల భద్రతకు ఏమాత్రం ముప్పు తలపెట్టే అవకాశం ఉందని భావించినా వాటిని వెంటనే తొలగించేస్తాయి. అందుకే థర్డ్‌ పార్టీ నుంచి కాకుండా కేవలం అధికారిక స్టోర్లను మాత్రమే డౌన్‌లోడ్‌కు ఉపయోగించాలి. ఒకవేళ ఇతర వాటి నుంచి ఎంచుకోవాల్సి వస్తే అమెజాన్‌ యాప్‌ స్టోర్‌, శామ్‌సంగ్‌ గెలాక్సీ స్టోర్‌ వంటి వాటిని కూడా పరిశీలించొచ్చు.

యాప్‌ ప్రైవసీ పాలసీ చదవాలి..

చాలా మంది యూజర్లు యాప్‌ ప్రైవసీ పాలసీని చదవకుండానే వాటికి సమ్మతి తెలియజేస్తారు. ఈ డాక్యుమెంట్‌ గందగోళంగా.. అసమగ్రంగా ఉందంటే అది నకిలీ యాప్‌ అని అనుమానించాలి. డేటా సేకరణ, దాని వినియోగానికి సంబంధించిన సమాచారం కచ్చితంగా ఉండాలి.

మీ సమాచారాన్ని సొమ్ము చేసుకోవద్దు..

యాప్‌లలో వాణిజ్య ప్రకటనల ద్వారా సంస్థలు ఆదాయాన్ని పొందుతాయి. యూజర్లకు యాప్‌ను ఉచితంగా అందించడం, దాన్ని మెయింటైన్‌ చేయడం కోసం ఇది తప్పదు. అయితే, ఈ ప్రకటనలు యూజర్ల సమాచారాన్ని తస్కరించి థర్డ్‌ పార్టీ అడ్వర్టైజర్లకు విక్రయించే ప్రమాదం ఉంది. యాప్‌ పనితీరు మెరుగుపర్చడం, యూజర్లకు మెరుగైన సేవలను అందించడం కోసం కొంత సమాచారాన్ని సేకరించడం తప్పనిసరి. కానీ, ఫోన్‌లోకి చొరబడి అవసరంలేని వివరాలను కూడా సేకరిస్తే మాత్రం నష్టమే. అందుకే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు దాని డేటా కలెక్షన్‌ పాలసీ క్షుణ్నంగా పరిశీలించాలి. మానిటైజేషన్‌పై స్పష్టమైన విధానాన్ని పేర్కొనలేదంటే కచ్చితంగా అనుమానించాల్సిందే.

రివ్యూలు, డౌన్‌లోడ్‌ల సంఖ్య..

ఒక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు దాని రివ్యూలను కచ్చితంగా పరిశీలించాలి. తక్కువ రేటింగ్‌ ఉన్నవాటిని ఎంపిక చేసుకోవద్దు. ఒక్కోసారి ఫేమస్‌ యాప్‌లకు సైతం తక్కువ రేటింగ్‌ ఉంటుంది. అలాంటప్పుడు అవి అధికారిక యాప్‌లవునో? కాదో? ధ్రువీకరించుకోవాలి. ఒక్కోసారి అచ్చం నిజమైన యాప్‌లను తలపించేలా నకిలీ యాప్‌లను సృష్టిస్తుంటారు.

అనవసర పర్మిషన్లు అడిగితే..

ఏ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నా.. ముందు కొన్ని అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని బట్టే ఆ యాప్‌ సురక్షితమైనదా.. కాదా.. తెలుసుకోవచ్చు. ఉదాహరణకు కాలిక్యులేటర్‌ యాప్‌నకు మైక్రోఫోన్‌, లొకేషన్‌ డేటాతో సంబంధం లేదు. అయినా, అడుగుతోందంటే అనుమానించాల్సిందే. అందుకే ఎలాంటి పర్మిషన్లు కోరుతుందో చూసుకోవాలి. సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు గుర్తిస్తే ఆ యాప్‌లను తిరస్కరించడం మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని