Paytm: పేటీఎం షేర్లను పూర్తిగా విక్రయించిన 6 మ్యూచువల్‌ ఫండ్లు!

Paytm: ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం షేరు విలువ భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో గత నెలలో కంపెనీ షేర్లను మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు భారీగా విక్రయించాయి.

Published : 13 Mar 2024 13:29 IST

ముంబయి: పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేర్లను ఫిబ్రవరిలో ఆరు మ్యూచువల్‌ ఫండ్లు పూర్తిగా విక్రయించాయి. మరో ఆరు ఫండ్లు కంపెనీలో తమ వాటాలను గణనీయంగా తగ్గించుకున్నాయి. మొత్తంగా గతనెలలో ఎంఎఫ్‌లు దాదాపు రూ.380 కోట్లు విలువ చేసే దాదాపు 91 లక్షల షేర్లను వదులుకున్నట్లు ‘మనీకంట్రోల్‌’ పేర్కొంది. ఆర్‌బీఐ ఆంక్షల తర్వాత పేటీఎం (Paytm) షేరు విలువ భారీగా పడిపోయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతానికి 18 మ్యూచువల్‌ ఫండ్ల దగ్గర రూ.1,426 కోట్లు విలువ చేసే పేటీఎం షేర్లు ఉన్నాయి. జనవరిలో 24 ఫండ్లు రూ.3,384 కోట్ల షేర్లను హోల్డ్‌ చేశాయి. ఫిబ్రవరిలో మహీంద్రా మనులైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ (15.16 లక్షల షేర్లు), క్వాంట్‌ ఎంఎఫ్‌ (6.13 లక్షల షేర్లు), బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఎంఎఫ్‌ (2.1 లక్షల షేర్లు), జేఎం ఫైనాన్షియల్‌ ఎంఎఫ్‌ (1.67 లక్షల షేర్లు), యూనియన్‌ ఎంఎఫ్‌ (1.15 లక్షల షేర్లు), బరోడా బీఎన్‌పీ పరిబాస్‌ ఎంఎఫ్‌ (17,000 షేర్లు) పేటీఎం నుంచి పూర్తిగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి.

మరోవైపు మోతీలాల్‌ ఓస్వాల్‌, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌, యూటీఐ, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, క్వాంట్‌, నిప్పన్‌ తమ వాటాలను గణనీయంగా తగ్గించుకున్నాయి. ఫిబ్రవరిలో పేటీఎం షేరు విలువ 50 శాతానికి పైగా పడిపోయిన విషయం తెలిసిందే. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలే అందుకు కారణం. కంపెనీ షేరు బుధవారం (13 మార్చి 2014) ఉదయం 11:44 గంటల సమయంలో 5 శాతం నష్టపోయి రూ.350.95 దగ్గర ట్రేడవుతోంది.

‘ఎన్నికలపై నాకేం తెలియదు’.. గూగుల్‌ జెమిని సమాధానం!

ఆర్‌బీఐ ఆంక్షల కారణంగా ఈనెల 15 నుంచి పీపీబీఎల్‌ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదార్లు యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపేందుకు, పేటీఎం యాప్‌ వాడటాన్ని కొనసాగించేందుకు వీలుగా థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ (TPAP) లైసెన్సును నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 15లోగా ఆ మేరకు అనుమతులు రావొచ్చని సమాచారం. ఈ విషయంపై ఎన్‌పీసీఐ వర్గాలు, పేటీఎం స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని