ఏఐ స్కిల్స్‌ ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు గిరాకీ.. వారికంటే 50% అధిక వేతనం!

AI: సాప్ట్‌వేర్‌ ఇంజినీర్ల కంటే ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకున్నవారే 50 శాతం అధిక వేతనాలు పొందుతున్నారు. ఓ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

Updated : 24 May 2024 17:00 IST

AI | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) వినియోగం వేగంగా పెరుగుతోంది. దీంతో ఉద్యోగులు సైతం ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంపెనీలు కూడా ఏఐ నైపుణ్యాలు కలిగిన అభ్యర్థుల వైపే మొగ్గు చూపుతున్నాయి. వారికి అధికంగానే ముట్టజెబుతున్నాయి. సాధారణ ఇంజినీర్ల కంటే ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నవారికి 50 శాతం అధిక వేతనం ఇస్తున్నారని తాజాగా ఓ నివేదికలో తేలింది. శాలరీ ట్రెండ్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ప్లాట్‌ఫామ్‌ Levels.fyi విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

2024 ఏప్రిల్‌ నాటికి అమెరికాలో ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల వేతనం సగటున 3,00,000 డాలర్లు (రూ.2,49,31,650) దగ్గరగా ఉందని నివేదిక తెలిపింది. అంటే సాధారణ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల జీతంతో పోలిస్తే సుమారు 1,00,000 డాలర్ల మేర అధిక వేతనం పొందుతున్నారని పేర్కొంది. 2022లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు, ఏఐ స్కిల్స్‌ ఉన్న వారి వేతనం మధ్య అంతరం 30 శాతం ఉండగా.. అది 50 శాతానికి చేరిందని నివేదిక తెలిపింది. ఏఐకున్న డిమాండ్‌ స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు టెకీలు ఈ సాంకేతికతను అందుపుచ్చుకోవాల్సిన అవసరాన్ని ఈ నివేదిక తెలియజేస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులను తీసుకొనేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీల్లో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, మెటా వంటి బడా కంపెనీలు ఉన్నాయి.

‘మనకెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చు’.. ఏఐపై మస్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రస్తుత ఏఐ పోటీ ప్రపంచంలో ప్రతిభావంతుల కోసం కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ సాంకేతికతను అందిపుచ్చుకున్న వారి కోసం కంపెనీలు పెద్ద మొత్తంలో జీతాలు, బోనస్‌లు అంటూ ప్రలోభపెడుతున్నాయి. మరోవైపు బడా టెక్‌ కంపెనీలు కొత్త టెక్నాలజీ అభివృద్ధికి గణనీయమైన పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఈ నిపుణులకు డిమాండ్‌ మరింత పెరగనుందని నివేదిక అభిప్రాయపడింది. ఏఐని అందిపుచ్చుకునే వారి  అవకాశాలకు కొదవ ఉండదని ఇప్పటికే పలువురు నిపుణులు విశ్లేషించారు. ఇటీవల అదే విషయంపై ఇన్ఫోసిస్‌ సీటీఓ కూడా మాట్లాడారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లతో పాటు, నాన్ సాఫ్ట్‌వేర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఇంజినీర్లు కూడా ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. దీన్ని సమర్థంగా అర్థం చేసుకోగల వారిదే భవిష్యత్‌ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని