Sony: త్వరలో సోనీ ఉద్యోగాల కోత.. ప్లేస్టేషన్‌ యూనిట్‌లో 900 మందికి ఉద్వాసన

ప్రముఖ టెక్‌ కంపెనీ సోనీ అనుబంధ సంస్థ ప్లేస్టేషన్‌ భారీగా ఉద్యోగాల్లో కోతను విధించింది.   

Updated : 28 Feb 2024 12:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెక్‌ దిగ్గజం సోనీ(Sony)కి చెందిన ప్లేస్టేషన్‌ విభాగంలో భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో 900 (8 శాతం)మందిని త్వరలో తొలగించనుంది. పరిశ్రమలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొంది. ‘‘పరిశ్రమలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకొంటున్నాయి. భవిష్యత్తు కోసం వ్యాపారాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలి. గేమర్లు, డెవలపర్ల అంచనాలను అందుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భవిష్యత్తు టెక్నాలజీలను గేమింగ్‌లోకి తీసుకెళ్లాలి. అందుకే ఈ విభాగం అత్యున్నత ఫలితాలు ఇవ్వడం కోసం మేం ఒక అడుగు వెనక్కి వేశాం. ఇది సవాళ్లతో కూడిన సమయం. అంతేకానీ, ఇది మా బలహీనతను సూచించదు’’ అని సోనీ ఇంటరాక్టీవ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సీఈవో జిమ్‌ ర్యాన్‌ బ్లాగ్‌లో చేసిన ఓ పోస్టులో పేర్కొన్నారు. 

లండన్‌ ప్లేస్టేషన్‌ స్టూడియోను పూర్తిగా మూసివేయనున్నారు. దీని ఆధీనంలోని ఫైర్‌స్పిరిట్‌ స్టూడియోస్‌ సిబ్బందిలో కూడా కోత విధించే అవకాశం ఉంది. మరోవైపు సోనీ ఇంటరాక్టీవ్‌ ఎంటర్‌టైన్మెంట్‌లోని వివిధ విభాగాల్లో కూడా లేఆఫ్‌లు కొనసాగుతాయి. ఉద్యోగులను తొలగించే సమయంలో వారికి అందాల్సిన ప్రయోజనాలు చెల్లిస్తామని కంపెనీ పేర్కొంది. 

విస్తృత భాగస్వామ్యాలతో కొత్త ఔషధాలు

ఇప్పటికే టెక్‌ పరిశ్రమలో లేఆఫ్‌ల హవా కొనసాగుతోంది. ఇటీవల యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌సంస్థను కొనుగోలు చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్‌ 2,000 మందిని తొలగించే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు రియోట్‌ గేమ్స్‌ సంస్థ జనవరిలో 11 శాతం ఉద్యోగులను తగ్గించుకొంది. గత ఏడాదిలో యూఎస్‌లో ఐటీ కంపెనీలు దాదాపు 2.40 లక్షల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 32,000 ఐటీ ఉద్యోగాలు పోయినట్లు తెలుస్తోంది. నిన్నటికి నిన్న స్నాప్‌ ఇంక్‌., అనే సంస్థ తన ఉద్యోగుల్లో 10 శాతాన్ని (దాదాపు 540 మంది) తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఓక్తా ఇంక్‌, మైక్రోసాఫ్ట్‌ తన గేమింగ్‌ డివిజన్‌లో, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో విభాగంలో, వీడియో గేమ్‌ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ యూనిటీ సాఫ్ట్‌వేర్‌, మెసేజింగ్‌ అంకురం డిస్‌కార్డ్‌ ... వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని