కళానిధి మారన్‌ vs స్పైస్‌జెట్‌.. మాజీ బాస్‌ నుంచి ₹450 కోట్లు రిఫండ్‌ కోరనున్న ఎయిర్‌వేస్‌

కళానిధి మారన్‌ నుంచి రూ.450 కోట్లు స్పైస్‌జెట్‌ రిఫండ్‌ కోరనుంది. దిల్లీ హైకోర్టు తీర్పును అనుసరించి ఈ రిఫండ్‌ కోరనుంది.

Updated : 22 May 2024 16:03 IST

దిల్లీ: ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ.. తన మాజీ ప్రమోటర్‌ అయిన కళానిధి మారన్‌ నుంచి రూ.450 కోట్ల మేర రిఫండ్‌ కోరనుంది. గతంలో మారన్‌కు, ఆయనకు చెందిన కేఏఎల్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన రూ.730 కోట్ల మొత్తం నుంచి అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇవ్వాలని అడగనుంది. ఈమేరకు ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆ కంపెనీ నుంచి ఈ ప్రకటన వెలువడింది.

మారన్‌- స్పైస్‌జెట్‌ వివాదానికి సంబంధించి మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్‌ 2018లో రూ.580 కోట్లు మారన్‌కు చెల్లించాలని స్పైస్‌జెట్‌ను ఆదేశించింది. వడ్డీ కూడా చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో 2023లో దిల్లీ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పును సమర్థించింది. దీనిపై స్పైస్‌జెట్‌ అప్పీల్‌కు వెళ్లింది. దీంతో డివిజన్‌ బెంచ్‌ గత తీర్పులను పక్కనపెట్టి మారన్‌కు రూ.270 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. దీంతో స్పైస్‌జెట్‌కు ఊరట లభించినట్లయ్యింది.

స్పోర్ట్స్‌ ఫ్యాన్స్‌ కోసం జియో కొత్త ప్లాన్‌

గతంలో స్పైస్‌జెట్‌కు ప్రమోటర్‌గా వ్యవహరించిన కళానిధి మారన్‌.. తనకున్న 58.46 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్‌ అజయ్‌సింగ్‌కు బదిలీ చేశారు. ప్రతిఫలంగా రూ.1500 కోట్ల అప్పుల బాధ్యతను అజయ్‌సింగ్‌ తీసుకున్నారు. అయితే, ఈ ఒప్పందంలో భాగంగా తనకు కొన్ని వారంట్స్‌ను జారీ చేయలేదని మారన్‌ ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం కోర్టుకెళ్లింది. దీనిపై మధ్యవర్తిత్వ కోర్టు, దిల్లీ సింగిల్‌ బెంచ్‌ తీర్పులను అనుసరించిన స్పైస్‌జెట్‌.. మారన్‌, ఆయనకు చెందిన కాల్ ఎయిర్‌వేస్‌కు రూ.580 కోట్లు అసలు, రూ.150 కోట్లు వడ్డీ చొప్పున రూ.730 కోట్లు చెల్లించింది. దిల్లీ హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో స్పైస్‌జెట్ ఇప్పుడు అదనంగా చెల్లించిన రూ.450 కోట్లు రిఫండ్‌ కోరనుంది. ఈ క్రమంలో బుధవారం స్పైస్‌జెట్ షేరు స్వల్పంగా లాభపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని