Stock market: ఆల్‌టైమ్‌ గరిష్ఠాలకు సూచీలు.. సెన్సెక్స్‌ 1200 పాయింట్లు జంప్‌

Stock market closing bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 1245 పాయింట్లు, నిఫ్టీ 356 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Published : 01 Mar 2024 16:07 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock Market) భారీ లాభాలు నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్‌ సంకేతాలు, దేశీయంగా ఆర్థిక వ్యవస్థలో సానుకూల వాతావరణం సూచీల పరుగుకు కారణమయ్యాయి. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీ రెండు సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 1200 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 22,300 పాయింట్ల ఎగువన ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 72,606.31 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఓ దశలో 73,819.21 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకి కొత్త రికార్డును నమోదు చేసిన సూచీ.. చివరికి 1245 పాయింట్ల లాభంతో 73,745.35 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 355.95 పాయింట్లు లాభంతో 22,338.75 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.90గా ఉంది. సెన్సెక్స్‌లో టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, టైటాన్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు రాణించాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా షేర్లు మాత్రమే నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 83.03 వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు ధర 2055.60 వద్ద ట్రేడవుతోంది. 

‘సూర్యఘర్‌’కు దరఖాస్తు ఎలా? ₹78 వేల రాయితీ ఎలా పొందాలి?

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రాణించింది. వ్యవసాయ రంగం నెమ్మదించినా, తయారీ రంగంలో రెండంకెల వృద్ధి నమోదవడం, గనుల తవ్వకం, నిర్మాణరంగాలు మెరుగైన పనితీరును ప్రదర్శించడంతో మూడో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 8.4% వృద్ధి చెందింది. మరోవైపు 2023-24 మొత్తం మీద వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదు కావొచ్చని ఎన్‌ఎస్‌ఓ అంచనా వేసింది. ఈ గణాంకాలు సూచీల్లో ఉత్సాహం నింపాయి.
  • మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలూ దేశీయ సూచీలకు అండగా నిలుస్తున్నాయి. త్వరలో అమెరికాలో వడ్డీరేట్ల కోతపై ఫెడరల్‌ రిజర్వ్‌ స్పష్టతనిచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం సైతం దిగొచ్చే సూచనలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈనేపథ్యంలో గురువారం అక్కడి మార్కెట్లు రాణించాయి. ఆసియా- పసిఫిక్‌ సూచీలు మిశ్రమంగా ట్రేడవగా.. యూరోపియన్‌ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి.
  • రేపు ప్రత్యేక సెషన్: ప్రముఖ స్టాక్‌ ఎక్స్ఛేంజీలైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ శనివారం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించనున్నాయి. ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌లో ట్రేడింగ్‌ జరగనుంది. ప్రైమరీ సైట్‌లో ఏదైనా అవరోధం లేదా వైఫల్యం ఎదురైనప్పుడు సన్నద్ధతను తెలుసుకోవడానికి గానూ ఈ సెషన్‌ నిర్వహించనున్నట్లు రెండు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటల వరకు ప్రైమరీ సైట్‌లో, 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య డిజాస్టర్‌ రికవరీ సైట్‌లో ఇంట్రాడే ట్రేడింగ్‌ నిర్వహించనున్నారు. స్పెషల్‌ సెషన్‌లో అన్ని సెక్యూరిటీ, డెరివేటివ్‌ ప్రొడక్ట్‌లు అందుబాటులో ఉంటాయని ఎక్స్ఛేంజీలు తెలిపాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని