Gautam adani: అదానీ షేర్లు జూమ్‌.. కుబేరుల జాబితాలో టాప్‌-20లోకి అదానీ

Gautam adani: అదానీ గ్రూప్‌ షేర్లు దూసుకెళ్లడంతో గౌతమ్‌ అదానీ కుబేరుల జాబితాలో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. టాప్‌-20లోకి చేరారు.

Published : 29 Nov 2023 17:15 IST

Gautam adani | ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ (Gautam adani) ప్రపంచ కుబేరుల జాబితాలో మళ్లీ టాప్‌-20లోకి వచ్చారు. ఒకప్పుడు టాప్‌-3 స్థానాన్ని అందుకున్న ఆయన.. అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం ఆ స్థానాన్ని కోల్పోయారు. నివేదిక అనంతరం కంపెనీ షేర్లు భారీగా పతనం కావడంతో ఏకంగా మూడో స్థానం నుంచి 30వ స్థానానికి చేరుకున్నారు. తాజాగా అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లు మళ్లీ రాణిస్తుండడంతో కుబేరుల జాబితాలో పైకి వచ్చారు.

బ్లూమ్‌బెర్గ్‌ ప్రపంచ కుబేరుల తాజా జాబితా ప్రకారం.. గౌతమ్‌ అదానీ 19వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 66.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ జాబితాలో ఎలాన్ మస్క్‌ అగ్రస్థానంలో ఉండగా.. జెఫ్‌ బెజోస్‌, బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ టాప్‌-3లో కొనసాగుతున్నారు. భారత్‌కు చెందిన ముకేశ్‌ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే గౌతమ్‌ అదానీ సంపద ఇంకా 53.8 బిలియన్‌ డాలర్లు తక్కువగానే ఉండడం గమనార్హం.

నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్, జియో ప్రీపెయిడ్‌ ప్లాన్లు ఇవే..

అదానీ- హిండెన్‌బర్గ్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ షేర్లు రాణిస్తున్నాయి. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేస్తున్న సెబీ విశ్వసనీయతను ప్రశ్నించడానికి ఎటువంటి కారణమూ కనిపించడం లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అదే సమయంలో హిండెన్‌బర్గ్‌ నివేదికలోని అంశాలన్నిటినీ ‘వాస్తవాలు’గా కోర్టు పరిగణించాల్సిన అవసరమూ లేద’ని పేర్కొంటూ తీర్పును రిజర్వ్‌ చేసింది. దీంతో అదానీ గ్రూప్‌ కంపెనీల్లో కొనుగోళ్ల మద్దుతు కనిపిస్తోంది. బుధవారం సైతం గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.33 వేల కోట్లు మేర పెరిగింది. మరోవైపు బ్లూమ్‌బెర్గ్‌ 500 కుబేరుల జాబితాలో భారత్‌ నుంచి షాపూర్‌ మిస్త్రీ, శివ్‌నాడార్‌, సావిత్రి జిందాల్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ, రాధాకృష్ణ ధమానీ, ఉదయ్‌ కోటక్ వంటి వారు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని