Sundar Pichai: ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్‌ పిచాయ్‌

గూగుల్‌లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. 

Updated : 27 Apr 2024 14:06 IST

వాషింగ్టన్‌: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌ (Google)లో ఉద్యోగం సంపాదించడం టెకీలకు ఓ కల. అలాంటి సంస్థకు భారత్‌ నుంచి వెళ్లిన ఓ కుర్రాడు ఏకంగా సీఈఓ అయ్యాడు. ఒక ఉద్యోగిగా చేరి, దానిని నడిపించే స్థాయికి ఎదిగాడు. ఆయనే సుందర్‌ పిచాయ్ (Sundar Pichai). తన 20 ఏళ్ల గూగుల్ ప్రస్థానాన్ని వెల్లడిస్తూ తాజాగా ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన పోస్టు ఆకట్టుకుంటోంది.

‘‘ఏప్రిల్ 26, 2004.. గూగుల్‌లో నాకు మొదటిరోజు. అప్పటి నుంచి ఎన్నో మార్పులు వచ్చాయి. సాంకేతికత, మా ఉత్పత్తులను వినియోగించే వారి సంఖ్య..ఇలా ఎంతో మారింది. అలాగే నా జుట్టు కూడా. ఈ 20 ఏళ్లలో మారని అంశం ఒకటి ఉంది. ఆ అద్భుతమైన కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నేను పొందే థ్రిల్‌ ఇప్పటికీ మారలేదు. ఇందులో భాగమైనందుకు నేను ఎంతో అదృష్టవంతుడినని భావిస్తున్నాను’’ అంటూ ‘20’ నంబర్‌ ఉన్న చిత్రాన్ని షేర్ చేశారు. 2004లో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరిన నాటిది, ప్రస్తుత ఐడీ కార్డును పంచుకున్నారు. ఈ పోస్టు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీ జుట్టు తగ్గింది.. గూగుల్ ఆదాయం పెరిగిందని ఒకరు చమత్కరించారు. మీరు నా రోల్‌ మోడల్‌ సర్, మీ నిబద్ధత గొప్పది అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు.

ఇదీ సుందర్‌ పిచాయ్‌ లగ్జరీ లైఫ్‌.. ఎన్ని కార్లున్నాయంటే!

ఒక సాధారణ ఉద్యోగిగా గూగుల్‌లోకి అడుగుపెట్టిన సుందర్‌ పిచాయ్‌(Sundar Pichai) ఆ సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్, గూగుల్ డ్రైవ్‌ ఇలాంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ ఆయన ఆలోచనల నుంచే పుట్టుకొచ్చాయి. ఆ కష్టానికి ప్రతిఫలంగా 2015లో ఆయనకు సీఈవో పదవి దక్కిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని