Sundar Pichai: ‘ఆ ఫలితాలు ఆమోదయోగ్యం కాదు’.. జెమినిలో సమస్యపై సుందర్‌ పిచాయ్‌

గూగుల్‌ జెమిని ఇటీవల వెల్లడించిన ఫలితాలు వివాదాస్పదం కావడంతో.. వాటిపై కంపెనీ సీఈవో సుందర్‌ పిచాయ్‌ స్పందించారు.

Published : 28 Feb 2024 14:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్ (Google) సంస్థ అత్యాధునిక కృత్రిమమేధ (AI) టూల్‌ ‘జెమిని’ (Gemini)ని గతేడాది డిసెంబరులో పరిచయం చేసింది. అయితే, ఇటీవల ఈ టూల్‌ వెల్లడించిన సమాధానాలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై కంపెనీ సీఈవో సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai)స్పందించారు. కొన్ని ప్రశ్నలకు జెమిని ఇచ్చిన ఫలితాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఉద్యోగులతో జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించారు. 

గత వారం జెమిని టూల్‌లో ప్రధాని మోదీ, పోప్‌ ఫ్రాన్సిస్‌, ఎలాన్‌ మస్క్‌, హిట్లర్‌ గురించి అడిగిన పలు ప్రశ్నలకు వివాదాస్పద సమాధానాలు ఇచ్చింది.  దీంతో గూగుల్‌ ఏఐ పనితీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ‘‘జెమిని యాప్‌లో ఇటీవల తలెత్తిన సమస్యలు మా దృష్టికి వచ్చాయి. అవి కొంతమందిని కించపరిచేలా ఉన్నాయని తెలిసింది. దీన్ని గూగుల్ అంగీకరించదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఏఐ టూల్స్‌ కొత్తవి. ప్రారంభంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. మాపై చాలా పెద్ద బాధ్యత ఉంది. అతి త్వరలో ఈ సమస్యను పరిష్కారిస్తాం. ఇందుకోసం మా బృందాలు పనిచేస్తున్నాయి’’అని పిచాయ్‌ వెల్లడించారు. 

గూగుల్‌ జెమిని వెల్లడించే ఫలితాల్లో కచ్చితత్వం ఉండేలా పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని అందరికీ చేరువ చేయడమే సంస్థ లక్ష్యం. అందులో ఎలాంటి పక్షపాతం ఉండదు. గూగుల్‌ ఉత్పత్తులు అందించే సమాచారం యూజర్లకు ఉపయోగకరంగా ఉండాలి. అప్పుడే మనపై విశ్వాసం కలుగుతుంది. ఏఐ సహా గూగుల్‌కు సంబంధించిన అన్ని ఉత్పత్తుల విషయంలో ఇదే పద్ధతిని పాటించాలి’’ అని సుందర్‌ ఆదేశించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని