Swiggy: జొమాటో కొత్త సేవలపై యాడ్‌.. అది మాది కాదంటూ స్విగ్గీ క్లారిటీ

Swiggy - Zomato: జొమాటో కొత్త సేవలపై విమర్శలు గుప్పిస్తూ వైరల్‌ అవుతున్న ప్రకటనపై స్విగ్గీ వివరణ ఇచ్చింది. అది తమది కాదని పేర్కొంది.

Published : 20 Mar 2024 19:09 IST

Swiggy - Zomato | ఇంటర్నెట్ డెస్క్‌: ఒకేతరహా వ్యాపారం నిర్వహించే సంస్థల మధ్య పోటీ సహజం. ఒక్కోసారి ప్రత్యర్థిపై విమర్శలు గుప్పించడం, వ్యంగ్య బాణాలు సంధించడం వంటివి జరుగుతూ ఉంటాయి. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ కంపెనీలైన స్విగ్గీ, జొమాటో (Swiggy - Zomato)ల మధ్య ఇలాంటివి ఇంతకుముందు జరిగాయి కూడా. తాజాగా వెజిటేరియన్స్‌ కోసం జొమాటో ‘వెజ్‌ మోడ్‌ సేవలకు శ్రీకారం చుట్టింది. దీనిపై విమర్శలు గుప్పిస్తూ స్విగ్గీ రూపొందించిన యాడ్‌ ఇదీ అంటూ ఓ ఏఐ ఇమేజ్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది వైరల్‌ కావడంతో ఆ యాడ్‌ తమది కాదంటూ స్విగ్గీ వివరణ ఇచ్చింది.

శాకాహారుల కోసం జొమాటో కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. వెజిటేరియన్స్‌ కోసం వెజ్‌ మోడ్‌, ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌ను ప్రారంభించింది. ఈ సేవలపై విమర్శలు గుప్పిస్తూ ఓ యాడ్‌ వైరల్‌ అయ్యింది. స్నో మౌంటెయిన్‌ ఏఐ సహ వ్యవస్థాపకుడు నీలేశ్‌ దీన్ని పోస్ట్‌ చేశారు. స్విగ్గీ యాడ్‌ అంటూ తన ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘మీ ఆహారపు అలవాట్లను మేం గోప్యంగా ఉంచుతాం. మా ఫ్లీట్‌ ఆ విషయాలను గోప్యంగా ఉంచుతుంది. పైగా మా డెలివరీ సిబ్బంది మూక దాడులకు గురయ్యే అవకాశం లేదు కాబట్టి వారికి జీవిత బీమా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మేర మీరూ కొంత ఆదా చేసుకోవచ్చు’’ అని అందులో ఉంది.

ఎయిర్‌ఫైబర్‌ యూజర్లకు జియో ఆఫర్‌.. ఫ్రీగా ట్రిపుల్‌ డేటా స్పీడ్‌

ఈ యాడ్‌ను నిజంగానే స్విగ్గీనే జారీ చేసిందని భావించి కొందరు దాన్ని వైరల్ చేశారు. మరికొందరు విమర్శలు గుప్పించారు. దీంతో దీన్ని వ్యంగ్యంగా పోస్ట్‌ చేశానని, అందులో సర్కాజమ్‌ ట్యాగ్‌ను తొలగించి ఈ పోస్ట్‌ను కొందరు వైరల్‌ చేస్తున్నారంటూ నీలేశ్‌ వివరణ ఇచ్చారు. ఈ యాడ్‌ కాస్తా స్విగ్గీ దృష్టికి రావడంతో ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘నకిలీ ప్రకటన తమ దృష్టికి వచ్చింది. దాంతో స్విగ్గీకి ఎలాంటి సంబంధం లేదు. స్విగ్గీ పేరుతో యాడ్‌ను సర్క్యులేట్‌ చేయొద్దు’’ అని విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఆన్‌లైన్‌లో కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలోనే జొమాటో కూడా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ప్యూర్‌ వెజ్‌ అందించే సిబ్బంది కూడా ఎర్ర రంగు యూనిఫామ్‌లోనే కనిపిస్తారని తెలిపింది. అలాగని ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ సేవలను నిలిపివేయడం లేదని స్పష్టం చేసింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని