Paytm: ఇతర యూపీఐ యాప్‌లను పరిగణించండి.. వ్యాపారులకు కాయిట్‌ సూచన

Paytm: పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం స్థానంలో ఇతర యాప్‌లను వినియోగించాలని కాయిట్‌ సూచించింది.

Published : 04 Feb 2024 15:14 IST

Paytm | ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (PPBL)’పై ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో వ్యాపారులకు విక్రయదారుల సమాఖ్య కాయిట్‌ (కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌- CAIT) కీలక సూచన చేసింది. పేటీఎంకు (Paytm) బదులు లావాదేవీల కోసం చట్టబద్ధమైన ఇతర చెల్లింపు యాప్‌లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ఈ సలహా ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇది కేవలం సూచన మాత్రమేనని తెలిపింది.

ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎంపై (Paytm) ఆందోళనలు రేకెత్తుతున్నాయని.. భద్రత విషయంలో చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారని కాయిట్‌ (CAIT) గుర్తుచేసింది. ఈ వేదిక అందించే ఆర్థిక సేవల కొనసాగింపుపైనా అనుమానాలు నెలకొన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిరంతరాయ లావాదేవీలు, వాటి భద్రత కోసం పేటీఎం నుంచి ఇతర యాప్‌లకు మారడం మేలని సూచించింది. డైరెక్ట్‌ యూపీఐ లావాదేవీలు, బ్యాంకులు అందించే పేమెంట్‌ యాప్‌లను ఉపయోగిస్తే మంచిదని చెప్పింది.

Paytm: పేటీఎంకు ఏమైంది?

వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (PPBL)పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ‘పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదు. వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు కూడా అప్పటి నుంచి చేయకూడదు’ అని ఆర్‌బీఐ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని