Paytm: పేటీఎంకు ఏమైంది?

పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌)పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

Updated : 05 Feb 2024 14:04 IST

పేటీఎంను (Paytm) కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌)పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ‘పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదు. వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు కూడా అప్పటి నుంచి చేయకూడదు’ అని ఆర్‌బీఐ తెలిపింది. పీపీబీఎల్‌ కార్యకలాపాలపై బయటి ఆడిటర్లు పూర్తి స్థాయిలో ఆడిట్‌ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని ఆడిట్‌లో తేలినందునే సంస్థపై మరింతగా పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సి వస్తోందని ఆర్‌బీఐ వెల్లడించింది.

ఇప్పటి దాకా 70% పతనం: పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో దాని మాతృ సంస్థ అయిన వన్‌97 కమ్యూనికేషన్స్‌ (Paytm) షేరు గత రెండు ట్రేడింగ్‌ రోజుల్లో (గురు, శుక్రవారం) 40 శాతం నష్టపోయింది. శుక్రవారం 20 శాతం నష్టంతో రూ.487.05 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ 2 రోజుల్లో రూ.17,378.41 కోట్లు కోల్పోయి రూ.30,931.59 కోట్లకు పరిమితమైంది. 2021లో రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.2,150 ఇష్యూ ధరతో పేటీఎం పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. రూ.18,300 కోట్లను సమీకరించింది. ఇందులో రూ.8,300 కోట్లను తాజా షేర్ల జారీ ద్వారా, రూ.10,000 కోట్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో సేకరించింది. నవంబరు 18న ఎన్‌ఎస్‌ఈలో రూ.రూ.1,950 వద్ద, బీఎస్‌ఈలో రూ.1,955 వద్ద నమోదైంది. అదే రోజున రూ.1,560 కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు షేరు సుమారు 77 శాతం నష్టపోవడం గమనార్హం.

ప్రారంభంలోనూ ఇబ్బందులు: పేటీఎంను (Paytm) 2009లో విజయ్‌ శేఖర్‌ శర్మ ప్రారంభించారు. ఆదిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ అంకుర సంస్థను నడిపారు. అలీబాబా గ్రూప్‌నకు చెందిన జాక్‌మా, సాఫ్ట్‌బ్యాంక్‌ నుంచి పెట్టుబడులు సేకరించి వార్తల్లోకెక్కారు. 2016లో ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడంతో అది పేటీఎంకు బాగా కలిసొచ్చింది. ఎక్కువ మంది డిజిటల్‌ చెల్లింపులకు మారి, పేటీఎంను అధికంగా వినియోగించారు. దీంతో దేశంలోని 100 మంది ధనికుల క్లబ్‌లో కూడా విజయ్‌ చేరారు. గూగుల్‌ వంటి కంపెనీలు చిన్న అంకుర సంస్థలను దెబ్బ తీసేలా కార్యకలాపాలు సాగిస్తున్నాయని బహిరంగంగా విమర్శించడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో విజయ్‌కు 51 శాతం ఉండగా, మిగతాది ఒన్‌ 97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ ఆధీనంలో ఉంది.

తాజాగా ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో విజయ్‌ ఎక్స్‌లో స్పందించారు. ‘ప్రతి సవాలుకు ఒక పరిష్కారం ఉంటుంది. దేశానికి సేవ చేసేందుకు మేము ఎప్పుడూ విధేయత కలిగి ఉంటామ’ని పోస్ట్‌ చేశారు.

ఇవీ ఆరోపణలు..

  • పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనీ లాండరింగ్‌ ఆరోపణలు, కేవైసీ ఉల్లంఘనలు ఇందుకు నేపథ్యమని తెలుస్తోంది. పేటీఎం వ్యాలెట్‌, పేమెంట్స్‌ బ్యాంక్‌ మధ్య కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు సమాచారం. అవసరమనుకుంటే ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగే అవకాశమూ ఉంది.
  • పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు సంబంధించి కేవైసీ చేయని లక్షలాది ఖాతాలను గుర్తించారట. ఒకే పాన్‌తో వేలాది ఖాతాలు తెరిచిన ఉదంతాలు వెలుగు చూశాయని సమాచారం. కేవైసీ చేసిన ఖాతాలకు నిర్దేశించిన గరిష్ఠ పరిమితిని మించి కొన్నిసార్లు ఆయా ఖాతాల్లో లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు 35 కోట్ల ఇ-వాలెట్లు ఉండగా, అందులో 31 కోట్ల ఖాతాలు నిద్రాణ స్థితిలో ఉన్నాయి. మిగిలిన 4 కోట్ల ఖాతాలు కూడా జీరో బ్యాలెన్స్‌, స్వల్ప మొత్తాలను కలిగి ఉన్నాయి. నిద్రాణ స్థితితో ఉన్న ఖాతాలను మనీలాండరింగ్‌ కోసం వినియోగించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిబంధనలకు అన్ని కంపెనీలూ ఒకటే

ప్రతి సంస్థను నియంత్రించేందుకు ఆ రంగంలో సంబంధింత నియంత్రణ సంస్థ ఉంటుంది. ఆర్థిక రంగంలోని పేటీఎంలో (Paytm) నిబంధనలు ఉల్లంఘించారని ఆర్‌బీఐ చర్యలకు తీసుకోవడం సబబే. ఫిన్‌టెక్‌ కంపెనీగా కొనసాగుతున్న పీపీబీఎల్‌ నియంత్రణ సంస్థ పర్యవేక్షణ నుంచి తప్పించుకోలేదు.

కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార, సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌


పేటీఎం వినియోగదారులకు సేవలందించేందుకు సిద్ధం..

మార్చి 1 నుంచి దాదాపు అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో పేటీఎం (Paytm) వినియోగదార్లకు సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ను ఆర్‌బీఐ రద్దు చేస్తే, పేటీఎంను కాపాడేందుకు మేం నేరుగా వెళ్లే ప్రణాళిక ఏదీ లేదు. ఆర్‌బీఐ గనుక మాకు మార్గదర్శకాలు జారీ చేసి, ఏదైనా ప్రభావం ఉంటే మేము అక్కడ ఉంటాం.

 ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని