Tata: బ్రిటన్‌లో టాటాల భారీ పెట్టుబడి.. సోమర్‌సెట్‌లో బ్యాటరీ ఫ్యాక్టరీ

యూకేలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్‌ సిద్ధమైంది. ఇందుకు సోమర్‌సెట్‌ను వేదికగా ఎంచుకొంది.

Published : 28 Feb 2024 14:39 IST

ఇంటర్నెట్‌డెస్క్: యూకే (UK)లోనే అతిపెద్ద బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎంపిక చేసిన ప్రాంతం పేరును టాటా (Tata) అనుబంధ సంస్థ అగ్రటాస్‌ తొలిసారి వెల్లడించింది. సోమర్‌సెట్‌ వద్ద ఉన్న బ్రిడ్జ్‌వాటర్‌ సమీపంలో ఇప్పటికే ఉన్న ఓ కర్మాగారంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం నాలుగు బిలియన్‌ పౌండ్లు  (రూ.4.1 లక్షల కోట్లు) మేరకు పెట్టబడులు పెట్టనుంది. ఈ కొత్త ప్లాంట్‌లో సుమారు 4,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనాలున్నాయి. దీనిలో ఉత్పత్తి 2026 నుంచి ప్రారంభమవుతుంది. 

సోమర్‌సెట్‌లోని రెండో ప్రపంచ యుద్ధం నాటి ఆయుధ కర్మాగారం ఉన్న ప్రదేశాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీని 2008లో మూసివేశారు. దీని భూమిలో 50శాతం అగ్రటాస్‌ కొనుగోలు చేసింది. 2030 నాటికి యూకే ఆటోమొబైల్‌ రంగానికి అవసరమైన సగం బ్యాటరీలను ఇక్కడి నుంచే ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఆ సంస్థ పేర్కొంది. ఇది ఏటా 40 గిగావాట్ల సామర్థ్యమున్న సెల్స్‌ను తయారు చేస్తుంది. వీటిని దాదాపు 5,00,000 ప్యాసింజర్‌ వాహనాల్లో అమర్చవచ్చు. 

ఈ కొత్త కర్మాగారం హింక్లీ పాయింట్‌ సీ అణు విద్యుత్‌ కేంద్రానికి 15.3 మైళ్ల దూరంలో ఉంటుంది. దీనిలో తొలుత జాగ్వర్‌, ల్యాండ్‌రోవర్‌ కార్లకు అవసరమైన బ్యాటరీలు తయారు చేయనున్నారు. ఆ తర్వాత మిగిలిన ఆటోమొబైల్‌ తయారీదార్లకు సరఫరా చేయాలన్నది ప్రణాళిక. ‘‘మేం కర్మాగారం నిర్మించే సమయంలో అన్ని కమ్యూనిటీలతో కలిసి పనిచేస్తాం’’ అని అగ్రటాస్‌ సీఈవో టామ్‌ ఫ్లాక్‌ తెలిపారు. ఈ పరిణామాలపై సోమర్‌సెట్‌ వాణిజ్య మండలి సీఈవో ఎమ్మా రౌలింగ్స్‌ స్పందిస్తు స్థానికులకు మంచి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. 

సరికొత్త భారతానికి అంకురాలే వెన్నెముక

టాటా గ్రూప్‌ తమ దేశంలో గిగాఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుందని గతేడాదే యూకే ప్రధాని రిషి సునాక్‌ ప్రకటించారు. తమ దేశంలో కార్ల తయారీ పరిశ్రమను బలోపేతం చేస్తుందని నాడు అభిప్రాయపడ్డారు. నెట్‌ జీరో వైపు అడుగులకు ఇది దోహదం చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని