Tata group: టాటాల ఐఫోన్‌ త్వరలోనే.. విస్ట్రన్‌ కొనుగోలు కొలిక్కి!

Tata group-iPhone: ఐఫోన్ల అసెంబ్లింగ్‌ విషయంలో టాటా గ్రూప్‌ మరో ముందడుగు వేసింది. విస్ట్రన్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది.

Published : 11 Jul 2023 13:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కొన్నేళ్లుగా ఐఫోన్ల (iPhone) తయారీ జరుగుతున్నా.. తైవాన్‌కు చెందిన కంపెనీలే చేపడుతున్నాయి. దేశీయ కంపెనీలేవీ తయారు చేయడం లేదన్న వెలితి ఉండేది. కానీ త్వరలో ఆ లోటు తీరనుంది. ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌ (Tata group) ఐఫోన్ల అసెంబ్లింగ్‌లోకి దిగనుంది. ఏడాదిగా తైవాన్‌ సంస్థ విస్ట్రన్‌ కార్ప్‌ కొనుగోలుకు టాటాలు (Tata group) జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఆగస్టులో ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

తైవాన్‌ సంస్థ విస్ట్రన్‌ కార్ప్‌ దేశీయంగా కర్ణాటకలో ఐఫోన్లను తయారు చేస్తోంది. ఐఫోన్ల తయారీలోకి అడుగుపెట్టాలని నిర్ణయించిన టాటా గ్రూప్‌.. విస్ట్రన్‌ కార్ప్‌తో ఏడాదిగా చర్చలు జరిపింది. తొలుత జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. తర్వాత కొనుగోలుకే టాటా కంపెనీ మొగ్గు చూపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 600 మిలియన్‌ డాలర్ల విలువకు విస్ట్రన్‌ యూనిట్‌ కొనుగోలు ప్రక్రియ కొలిక్కి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో ఐఫోన్‌ 14 మోడల్‌ అసెంబ్లింగ్‌ను చేపడుతున్నారు. సుమారు 10 వేల మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలతో ఐఫోన్ల తయారీని పెంచుకుంటూ వచ్చిన విస్ట్రన్‌ కార్ప్‌.. 2023 మార్చి నాటికి 1.8 బిలియన్‌ డాలర్లు విలువైన ఐఫోన్లను సరఫరా చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది కల్లా శ్రామిక శక్తిని సైతం మూడింతలు చేయాలని విస్ట్రన్‌ కార్పొరేషన్‌ పేర్కొంది. కొనుగోలు అనంతరం భారత్‌ నుంచి విస్ట్రన్‌ నిష్క్రమణ అనంతరం టాటా గ్రూప్‌ ఈ హామీలను కొనసాగించనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాజా పరిణామం పట్ల టాటా గ్రూప్‌, విస్ట్రన్‌, యాపిల్‌ స్పందించలేదు.

దేశీయంగా తయారీని ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇస్తోంది. దీనికి తోడు చైనా నుంచి ఐఫోన్ల ఉత్పత్తిని కొంతమేరయినా తరలించాలని యాపిల్‌ సైతం నిర్ణయించింది. ఈ క్రమంలోనే టాటా గ్రూప్‌ ఐఫోన్ల అసెంబ్లింగ్‌కు ముందుకొచ్చింది. ఇది కార్యరూపం దాలిస్తే ఐఫోన్లను తయారుచేసే తొలి భారత కంపెనీగా టాటా గ్రూప్‌ నిలవనుంది. ప్రస్తుతం టాటా గ్రూప్‌ ఉప్పు నుంచి ఐటీ సేవల వరకు వివిధ రంగాల్లో ఉంది. ఐఫోన్ల అసెంబ్లింగ్‌ ద్వారా కొత్త రంగంలోకి అడుగు పెట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని