India: పెట్టుబడుల ఆకర్షణ.. చైనాను దాటేసిన భారత్‌!

పెట్టుబడులను ఆకర్షించే మార్కెట్‌ల జాబితాలో చైనా కంటే భారత్‌ ముందంజలో ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా పెట్టుబడిదారులకు భారత్‌లో ఎంతో అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపింది. 

Published : 11 Jul 2023 02:28 IST

దిల్లీ: పెట్టుబడులకు అనుకూలమైన, అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్‌ల జాబితాలో చైనా (China)ను భారత్‌ (India) అధిగమించినట్టు ఓ సర్వే వెల్లడించింది. అధిక జనాభా, రాజకీయ స్థిరత్వం, చురుకైన నియంత్రణ వ్యవస్థల కారణంగా భారత్‌ ఈ ఘనత సాధించినట్లు ఓ సర్వే పేర్కొంది. ఇన్వెస్కో గ్లోబల్‌ సావరీన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్ అనే సంస్థ 85 సావరీన్‌ వెల్త్‌ ఫండ్స్‌ (సార్వభౌమ సంపద నిధి సంస్థలు), 57 సెంట్రల్‌ బ్యాంకులకు చెందిన ప్రణాళిక విభాగం అధిపతులు, 142 మంది చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ల అభిప్రాయాల ఆధారంగా ఓ సర్వే నిర్వహించి నివేదిక రూపొందించింది. ఈ సంస్థల మొత్తం సంపద విలువ 21 ట్రిలియన్‌ డాలర్లు ఉంటుందని నివేదికలో పేర్కొంది.

వ్యాపార నిర్వహణ, రాజకీయ స్థిరత్వం పరంగా భారత్‌ ఇప్పుడు ఎంతో మెరుగ్గా ఉందని ఇన్వెస్కో సంస్థ నివేదికలో వెల్లడించింది. దేశంలో పెరుగుతున్న జనాభా, ప్రణాళికాపరమైన కార్యక్రమాలు, సావరీన్‌ పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం వంటి అనుకూల అంశాలు పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్‌ను చైనా కంటే ముందంజలో ఉంచాయని తెలిపింది.

‘‘ చైనా, భారత్‌ల గురించి మాకు పూర్తి అవగాహన లేదు. కానీ, వ్యాపారపరమైన నిర్వహణ, పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్‌ ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉంది. భారత్‌లో జనాభా పెరుగుదల వేగంగా ఉంది. కొత్త కంపెనీల ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం ఎంతో ఆసక్తి కనబరుస్తోంది. ఇందుకోసం చక్కటి నియంత్రణ కార్యక్రమాలు చేపడుతోంది. అంతేకాకుండా పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది’’ అని తూర్పు మధ్య ప్రాంతానికి చెందిన ఓ సావరీన్ ఫండ్‌ ప్రతినిధి తెలిపారు.

మెక్సికో, బ్రెజిల్‌ వంటి దేశాల తరహాలో విదేశీ పెట్టుబడుల ద్వారా భారత్‌ కూడా లబ్ధి పొందుతోందని ఇన్వెస్కో నివేదికలో వెల్లడించింది. దాంతోపాటు విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయమైన మార్కెట్లుగా భారత్‌, దక్షిణ కొరియాలు ఉన్నాయని తెలిపింది. రాబోయే దశాబ్ద కాలంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని ఈ సర్వేలో పాల్గొన్న సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో బంగారం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల బాండ్‌లకు మంచి డిమాండ్‌ ఉంటుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని