TATA Group IPO: టాటా గ్రూప్‌ నుంచి మరో ఐపీఓ?

TATA Group IPO: దాదాపు 20 ఏళ్ల తర్వాత గత ఏడాది టెక్‌ కంపెనీని ఐపీఓకి తెచ్చిన టాటా గ్రూప్‌.. తాజాగా మరో పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Updated : 26 Feb 2024 17:15 IST

TATA Group IPO | ఇంటర్నెట్‌ డెస్క్‌: టాటా గ్రూప్‌ (TATA Group) మరో ఐపీఓకి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. విద్యుత్తు వాహన తయారీ కంపెనీ ‘టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రికల్‌ మొబిలిటీ లిమిటెడ్‌ (TPEM)’ ను పబ్లిక్‌ ఇష్యూకు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా 1-2 బిలియన్‌ డాలర్ల వరకు సమీకరించొచ్చని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ‘బిజినెస్‌లైన్’ వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం లేదా 2025-26 తొలినాళ్లలో ఐపీఓ ఉండొచ్చని సమాచారం.

టాటా మోటార్స్‌కు (TATA Motors) అనుంబంధంగా పనిచేస్తున్న టీపీఈఎం దేశంలో అతిపెద్ద విద్యుత్తు వాహన తయారీ సంస్థగా కొనసాగుతోంది. నెక్సన్‌, టియాగో వంటి వాటిల్లో ఈవీ మోడళ్లను విక్రయిస్తోంది. ప్రస్తుతానికి ప్రయాణికుల వాహన విభాగంలో దేశీయంగా ఈ కంపెనీదే 80 శాతం మార్కెట్‌ వాటా. 2023 జనవరిలో అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ కంపెనీ టీపీజీ నుంచి టీపీఈఎం 1 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది. అప్పటికి  కంపెనీ విలువ 9.5- 10 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. 2026 నాటికి రెండు బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టాలనే లక్ష్యంలో భాగంగా ఈ మొత్తం సమకూర్చుకుంది.

2023-24లో టాటా మోటార్స్‌ (TATA Motors) 53,000 విద్యుత్తు కార్లను విక్రయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష వాహనాల వరకు అమ్ముడవుతాయని అంచనా. 2024 జనవరిలో కంపెనీ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 69 శాతం పుంజుకొని 6,979 యూనిట్లకు చేరాయి. వచ్చే 3 - 4 ఏళ్లలో మొత్తం 10 మోడళ్లలో విద్యుత్తు కార్లను తీసుకురావాలని యోచిస్తోంది. టాటా నెక్సాన్‌.ఈవీ ధర ఇప్పుడు రూ.14.49 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. టియాగో.ఈవీ రూ.7.9 లక్షల నుంచి లభిస్తోంది. నెక్సాన్‌పై రూ.1.2 లక్షల వరకు తగ్గగా.. టియాగోపై రూ.70,000 వరకు రాయితీ ఇస్తోంది. 

గత ఏడాది టాటా టెక్‌ ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ గ్రూప్‌ నుంచి వచ్చిన పబ్లిక్‌ ఇష్యూ ఇది. అంతా ఊహించినట్లుగానే దీనికి భారీ స్పందన లభించింది. రూ.3042 కోట్ల సమీకరించేందుకు వచ్చిన ఈ ఇష్యూలో 4.5 కోట్ల షేర్లు సబ్‌స్క్రిప్షన్‌కు ఉంచగా.. 69.4 రెట్ల స్పందన లభించింది. ఒక్కో షేరు ఇష్యూ ధరను రూ.500గా నిర్ణయించగా.. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో రూ.1,200 దగ్గర లిస్టయ్యింది. సోమవారం (2024 జనవరి 26) మధ్యాహ్నం 12:33 గంటలకు షేరు విలువ రూ.1,101 దగ్గర ట్రేడవుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని