Tesla: భారత్‌లో తయారీకి టెస్లా ఆసక్తిగా లేదు: కేంద్ర మంత్రి కుమారస్వామి

Eenadu icon
By Business News Team Updated : 02 Jun 2025 15:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Tesla | ఇంటర్నెట్‌డెస్క్‌: విద్యుత్తు వాహనాల తయారీ దిగ్గజం టెస్లా భారత్‌లో కార్ల తయారీకి సుముఖంగా లేదని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్‌.డి. కుమారస్వామి వ్యాఖ్యానించారు. కానీ, దేశీయంగా షోరూమ్‌లు ఏర్పాటు చేసే ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. భారత్‌లో విద్యుత్తు కార్ల తయారీని ప్రోత్సహిస్తూ కేంద్ర తీసుకొచ్చిన పథకానికి అవసరమైన మార్గదర్శకాలను ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో తెలియజేస్తూ ఈ విషయాన్ని చెప్పారు. 

‘‘టెస్లా కేవలం షోరూమ్‌లు ఏర్పాటుకు మాత్రమే ఆసక్తిగా ఉంది. భారత్‌లో తయారీకి ఇష్టపడటంలేదు. తయారీ దిశగా ఆ సంస్థ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆసక్తి వెల్లడికాలేదు. భారత్‌ విద్యుత్తు కార్ల తయారీ ప్రోత్సాహక స్కీమ్‌లోని భాగస్వాముల సమావేశంలో టెస్లా ప్రతినిధులు తొలి రౌండ్‌కు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత జరిగి రెండు, మూడో రౌండ్‌ చర్చల్లో ఆ సంస్థ ప్రతినిధులు పాల్గొనలేదు’’ అని కుమార స్వామి పేర్కొన్నారు. వాస్తవానికి గతేడాది ఏప్రిల్‌లో మస్క్‌ భారత్‌లో పర్యటించాల్సి ఉండగా.. కంపెనీ పనులతో ఆయన పర్యటన రద్దైంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్, మస్క్‌ ఫాక్స్‌ న్యూస్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిలో భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటుపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  ‘‘ఈ ప్రపంచంలోని ప్రతి దేశం మమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. సుంకాలతో మా నుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారు. దీంతో ఎలాన్‌ మస్క్‌ తన కార్లను విక్రయించడం అసాధ్యంగా మారుతోంది. ఉదాహరణ భారతే..! ఇప్పుడు ఆయన (మస్క్‌) భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన వరకు అది మంచిదే కావొచ్చు.. కానీ, అమెరికా పరంగా అది చాలా అన్యాయమైన నిర్ణయమే’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ఇక భారత ప్రధాని మోదీతో భేటీని నాడు ట్రంప్‌ గుర్తుచేసుకున్నారు. విద్యుత్‌ కార్లపై అధిక సుంకాల విషయాన్ని మోదీతో ప్రస్తావించినట్లు తెలిపారు. సుంకాల సమస్యను పరిష్కరించుకోవడంతో పాటు వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం కోసం ఇరుదేశాలు కలిసి పనిచేసేలా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇక ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌ కూడా భారత్‌లో కార్యకలాపాలు విస్తరించడానికి ట్రంప్‌ ఇష్టపడలేదు. భారత్‌లో తయారైన ఫోన్లు అమెరికా విక్రయించాలంటే 25శాతం అదనపు సుంకం చెల్లించాల్సిందే అని యాపిల్‌కు తేల్చిచెప్పారు.

Tags :
Published : 02 Jun 2025 15:03 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు