Tesla layoffs: టెస్లాలో ఉద్యోగాల కోత.. 14వేల మందికి ఉద్వాసన!

టెస్లా సంస్థ ఉద్యోగ కోతలను ప్రకటించింది. 14 వేల మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడనుంది.

Published : 15 Apr 2024 17:41 IST

Tesla layoffs | ఇంటర్నెట్‌ డెస్క్: ఎలాన్‌ మస్క్‌కు (Elon musk) చెందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ఉద్యోగ కోతలు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది. దీనివల్ల సుమారు 14వేల మందిపై ఈ ప్రభావం పడనుంది. ఈమేరకు ఉద్యోగులకు ఎలాన్‌ మస్క్‌ లేఖ రాసినట్లు ఎలక్ట్రెక్ అనే వెబ్‌సైట్‌ తన కథనంలో పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా గతేడాది డిసెంబర్‌ నాటికి టెస్లాలో 1.40 లక్షల మంది పని చేస్తున్నారు. ఇందులో పది శాతం శాతం అంటే దాదాపు 14వేల మందిని టెస్లా తొలగించనుంది. కొన్ని రోల్స్‌లో డూప్లికేషన్‌ కారణంగా ఈ తొలగింపులు చేపడుతున్నట్లు మస్క్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఇంతకాలం కంపెనీకి సేవలందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త అవకాశాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఉద్యోగంలో కొనసాగుతున్నవారు సవాళ్లకు సిద్ధమవ్వాలని సూచించారు. ఏయే విభాగాల వారిని తొలగిస్తున్నదీ ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే తొలగించిన ఉద్యోగులకు సిస్టమ్‌ యాక్సెస్‌ నిలిపివేసినట్లు సమాచారం.

Ola electric: ధరలు తగ్గించిన ఓలా.. ఎస్‌1X ఇక రూ.69,999 నుంచే!

మార్కెట్‌ విలువ పరంగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన టెస్లా.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విక్రయాల్లో క్షీణత నమోదు చేసింది. మార్కెట్‌ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. త్వరలో రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. దీనికితోడు టెస్లా కొత్తగా తీసుకొచ్చిన సైబర్‌ ట్రక్‌ ఉత్పత్తి నెమ్మదించడం వల్ల ఆ కంపెనీ ఈవీల విక్రయాలు క్షీణించే అవకాశం ఉందన్న అంచనాలూ ఉన్నాయి. ఈనేపథ్యంలో ఉద్యోగ కోతలు ప్రకటించడం గమనార్హం. మరోవైపు టెస్లా భారత్‌కు వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెలలోనే మస్క్‌ భారత్‌కు రానున్నారు. ఈ పర్యటనలో టెస్లాతో పాటు, స్టార్‌ లింక్‌ ప్రణాళికలనూ వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని