TRAI: ప్రమోషనల్‌ ఎస్సెమ్మెస్‌లు, కాల్స్‌కు చెక్‌.. ట్రాయ్‌ కీలక ఆదేశాలు

లోన్లు, స్కీములు అంటూ వచ్చే సందేశాలకు ముకుతాడు వేస్తూ ట్రాయ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అలాంటి సందేశాలు పంపాలంటే యూజర్‌ అనుమతి తీసుకోవాల్సిందేనని టెలికాం ఆపరేటర్లకు ట్రాయ్ స్పష్టంచేసింది.

Updated : 09 Nov 2023 16:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక్కోసారి మనకొచ్చే రెగ్యులర్‌ కాల్స్‌, మెసేజులు కంటే ప్రమోషనల్‌ కాల్స్‌, మెసేజులే ఎక్కువగా ఉంటాయి. ఓ యూజర్‌ రోజుకు సగటున 12 మెసేజులను స్పామ్‌ సందేశాలు అందుకుంటున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఇలాంటి పరిస్థితుల్లో టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ (TRAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రమోషనల్‌, స్పామ్‌ ఎస్సెమ్మెస్‌లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ తరహా సందేశాలు పంపే ముందు యూజర్ల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించింది.

ప్రమోషనల్‌ సందేశాలను అరికట్టడానికి డిజిటల్‌గా అనుమతి పొందేందుకు డీసీఏ పేరిట ఓ ప్రోగ్రామ్‌ను ఇటీవల ట్రాయ్‌ తీసుకొచ్చింది. దీని ప్రకారం లోన్లు, స్కీములు అంటూ బ్యాంకులు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ప్రమోషనల్‌ సందేశాలు పంపించాలంటే ముందుగా యూజర్‌ అనుమతి తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఏజెన్సీ యూజర్‌కు కంటెంట్ పంపించాలీ అంటే.. ముందుగా టెలికాం ఆపరేటర్ నుంచి అనుమతి పొందాలి. అనంతరం సదరు టెలికాం ఆపరేటర్‌ 127*** షార్ట్‌ కోడ్‌తో కూడిన ఓ ఎస్సెమ్మెస్‌ పంపుతుంది. ఆ సందేశంలో దేనికోసం అనుమతి కోరుతున్నదీ అందులో ఉంటుంది.

డిస్నీ ఇండియా కొనసాగుతుంది.. సీఈఓ క్లారిటీ

ఆ మెసేజ్‌కు యూజర్‌ అనుమతి ఇవ్వొచ్చు. లేదంటే నిరాకరించనూ వచ్చు. ఒకవేళ యూజర్‌ అనుమతికి నిరాకరిస్తే.. టెలికాం కంపెనీ సదరు ఏజెన్సీని ఆ యూజర్‌కు ఇకపై సందేశాలు పంపకుండా నిలువరించాల్సి ఉంటంది. అలాగే ప్రమోషనల్‌ సందేశాలకు ఇచ్చిన అనుమతులను ఎప్పుడైనా సులువుగా ఉపసంహరించుకునేందుకు వీలుగా ఓ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను సిద్దం చేయాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ సూచించింది. తొలుత స్పామ్‌ సందేశాలను అరికట్టాలని ట్రాయ్‌ భావిస్తోంది. తర్వాత కాల్స్‌కూ దీన్ని విస్తరించనుంది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని, ఈ నోటిఫికేషన్‌కు ముందు ఇచ్చిన అనుమతులు చెల్లుబాటు కావని స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు