ixigo IPO: 10న ఇక్సిగో ఐపీఓ ప్రారంభం.. ధరల శ్రేణి రూ.88-93

ixigo IPO: లీ ట్రావెన్యూస్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ ఐపీఓ (ixigo IPO) జూన్‌ 10న ప్రారంభమై 12న ముగియనుంది. ధరల శ్రేణిని కంపెనీ రూ.88-93గా నిర్ణయించింది.

Published : 05 Jun 2024 15:43 IST

ixigo IPO | దిల్లీ: ఇక్సిగో పేరిట ఆన్‌లైన్‌ ట్రావెల్‌ బుకింగ్‌ వేదికను నిర్వహిస్తున్న లీ ట్రావెన్యూస్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ ఐపీఓ (ixigo IPO) జూన్‌ 10న ప్రారంభమై 12న ముగియనుంది. దీని ధరల శ్రేణిని కంపెనీ రూ.88-93గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.740 కోట్లు సమీకరించనుంది.

గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇక్సిగో తాజా ఐపీఓలో (IPO) రూ.120 కోట్లు విలువ చేసే కొత్త షేర్లను విక్రయిస్తోంది. మరో 6.66 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉంచుతోంది. సమీకరించిన నిధుల నుంచి రూ.45 కోట్లు నిర్వహణ మూలధన అవసరాల కోసం కేటాయించనుంది. డేటా సైన్స్‌, క్లౌడ్‌, కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతికతలను సమకూర్చుకోవడానికి రూ.26 కోట్లు వాడుకోనుంది. మరికొన్ని నిధులను కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు ఉపయోగించుకోనుంది. ఐపీఓలో ఉంచిన షేర్లలో 75 శాతం అర్హత గల సంస్థాగత కొనుగోలుదారులు (QIBs), 15 శాతం సంస్థాగతేతర మదుపర్లు (NIIs), 10 శాతం రిటైల్ మదుపర్లకు కేటాయించారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 161 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

లీ ట్రావెన్యూస్‌ టెక్నాలజీని ఆలోక్‌ బాజ్‌పాయ్‌, రజినీశ్‌ కుమార్‌ 2007లో ఏర్పాటుచేశారు. దేశంలో ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ అగ్రిగేటర్‌గా కొనసాగుతోంది. రైలు, బస్సు, విమాన టికెట్లు సహా హోటల్‌ బుకింగ్‌లకు ఇక్సిగో ప్రధాన వేదికగా ఉంది. కంపెనీ ఆదాయం 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.517 కోట్లుగా నమోదైంది. లాభం రూ.23.4 కోట్లుగా నివేదించింది. యాక్సిస్‌ క్యాపిటల్‌, డీఏఎం క్యాపిటల్‌ అడ్వైజర్స్‌, జేఎం ఫైనాన్షియల్‌ ఈ ఐపీఓకి లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని