Uday Kotak: కోటక్‌ బ్యాంక్‌ సీఈఓ పదవికి ఉదయ్‌ కోటక్‌ రాజీనామా.. 4 నెలల ముందే!

Uday Kotak Stepdown: కోటక్‌ మహీంద్రా బ్యాంక్ సీఈఓగా ఉదయ్‌ కోటక్‌ రాజీనామా చేశారు. స్వచ్ఛందంగానే ఈ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Updated : 02 Sep 2023 16:49 IST

దిల్లీ: ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ కోటక్‌ మహీంద్రా (Kotal Mahindra Bank) మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ పదవి నుంచి ఉదయ్‌ కోటక్‌ (Uday Kotak) వైదొలిగారు. ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎక్సెంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. వాస్తవానికి ఉదయ్‌ కోటక్‌ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు ఉంది. నాలుగు నెలల ముందే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. తాత్కాలిక ఎండీగా ప్రస్తుత జాయింట్‌ ఎండీ దీపక్‌ గుప్తా వ్యవహరించనున్నారు.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్ సీఈఓ, ఎండీ పదవికి రాజీనామా చేస్తూ ఉదయ్‌ కోటక్‌ బ్యాంక్‌ బోర్డుకు లేఖ రాశారు. పదవీ విరమణ చేయడానికి ఇంకా గడువు ఉన్నప్పటికీ ఇదే సరైన సమయం అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా తనతో పాటు ఛైర్మన్‌, జాయింట్‌ ఎండీ రాజీనామా చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో సులువుగా అధికార మార్పిడి జరగాలన్న ఉద్దేశంతో తాను స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉదయ్‌ కోటక్‌ తన లేఖలో పేర్కొన్నారు.

సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌ కడుతున్నారా?.. నెలాఖరులో ఇది పూర్తి చేయండి!

1985లో ఎన్‌బీఎఫ్‌సీని స్థాపించిన ఉదయ్‌ కోటక్‌.. 2003 నాటికి పూర్తి స్థాయి కమర్షియల్‌ బ్యాంక్‌గా తీరిదిద్దారు. ప్రస్తుతం మార్కెట్‌ విలువ పరంగా మూడో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్‌గా ఉంది. సీఈఓగా వైదొలగనున్నప్పటికీ.. బ్యాంక్‌ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుడిగా ఉదయ్‌ కోటక్‌ కొనసాగనున్నారు. ఏదైనా బ్యాంక్‌కు సీఈఓగా 15 ఏళ్లకు మించి ఉండకూడదని ఆర్‌బీఐ నిబంధనలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో పదవీకాలం ముగియకముందే ఉదయ్‌ కోటక్‌ రాజీనామా చేశారు. 2024 జనవరి 1 తర్వాత కోటక్‌ బ్యాంక్‌కు కొత్త సీఈవో రానున్నారు.

రాజీనామా లేఖలో ఏం చెప్పారంటే?

‘‘ఈ సంస్థను స్థాపించి 38 ఏళ్లు అయ్యింది. ముంబయిలో ముగ్గురితో ప్రారంభించిన ఈ సంస్థ.. ఇవాళ ప్రముఖ బ్యాంకుగా అవతరించింది. భారత్‌తో పాటు మరో ఐదు దేశాల్లో లక్ష మంది ఉద్యోగులతో సేవలందిస్తోంది. ఈ మొత్తం ప్రయాణం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పదవి నుంచి వైదొలగడానికి కొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ.. కొన్ని రోజులుగా దీనిపై ఆలోచన చేస్తున్నా. ఇప్పుడే సరైన సమయం అని భావించి వైదొలుగుతున్నా. వారసత్వ ప్రణాళికకు సంబంధించి ఇప్పటికే బ్యాంక్‌ పలు చర్యలు తీసుకుంది. ఈ విషయంలో ఆర్‌బీఐ నిర్ణయం ఎదురుచూస్తున్నాం. రాబోయే కొన్ని నెలల పాటు నా సమయాన్ని వ్యక్తిగత, కుటుంబ కార్యక్రమాలకు కేటాయించాలనుకుంటున్నా. కొన్ని నెలల్లో పెద్ద కుమారుడి పెళ్లి ఉంది. బ్యాంక్‌ పట్ల ప్రజల విశ్వాసం మున్ముందూ ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నా. సీఈఓగా వైదొలగినప్పటికీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కొనసాగుతా. ఈ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొంటూ బోర్డు ఛైర్మన్‌కు ప్రకాశ్‌ ఆప్టేకు సొంత దస్తూరితో ఉదయ్‌ కోటక్‌ లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని