Unclaimed Deposits: ₹ 42 వేల కోట్లు.. బ్యాంకుల వద్ద క్లెయిమ్ చేయ‌ని డిపాజిట్లు

గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల విలువ 28 శాతం మేర పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ తెలిపారు. 

Published : 19 Dec 2023 20:46 IST

దిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్‌ చేయని మొత్తాలు రూ.42,270 కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ రాజ్యసభలో వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల విలువ 28 శాతం మేర పెరిగిందని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేయని మొత్తాలు రూ.32,934 కోట్లు ఉంటే, 2023 మార్చి నాటికి ఈ మొత్తం రూ. 42,272 కోట్లకి చేరిందని తెలిపారు. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.36,185 కోట్లు ఉంటే, ప్రైవేటు బ్యాంకుల్లో రూ.6,087 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. 

భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) నిబంధనల ప్రకారం పదేళ్లు, అంతకుమించి నిర్వహణలో లేని డిపాజిట్లను ‘ఆర్‌బీఐ డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్’ (DEA) నిధులకు బ్యాంకులు బదిలీ చేస్తాయని భగవత్‌ కరాడ్‌ తెలిపారు. బ్యాంకుల్లో ఉన్న ఇలాంటి డిపాజిట్లను ఖాతాదారులకు అందించేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. ‘అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్స్ గేట్‌వే టు యాక్సెస్‌ ఇన్ఫర్మేషన్‌’ (UDGAM) పేరుతో నిర్వహిస్తున్న ఈ వెబ్‌పోర్టల్‌లో దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల సమాచారం తెలుసుకోవచ్చు.

మోటోరోలా ఆఫర్‌.. ఫ్లిప్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌

‘100 రోజులు 100 చెల్లింపులు’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆర్‌బీఐ.. జూన్‌ 1, 2023 నుంచి సెప్టెంబరు 8, 2023 వరకు దేశంలోని ప్రతి జిల్లాలో ఉన్న బ్యాంకుల్లో ఉన్న 100 అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను గుర్తించి వాటిని సెటిల్‌ చేసిందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా దేశంలోని 31 ప్రధాన బ్యాంకులు రూ.1,432.68 కోట్లు ఖాతాదారులకు తిరిగి చెల్లించినట్లు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు