UPI: ఫ్రాన్స్‌లోనూ ‘యూపీఐ’ సేవలు షురూ.. తొలుత ఈఫిల్‌ టవర్‌ టికెట్‌ బుకింగ్‌కే!

‘యూపీఐ’ సేవలు ఫ్రాన్స్‌లోనూ ప్రారంభమయ్యాయి. తొలుత ప్రఖ్యాత పర్యాటక కేంద్రం ‘ఈఫిల్‌ టవర్‌ (Eiffel Tower)’ వద్ద అందుబాటులోకి వచ్చాయి.

Published : 02 Feb 2024 23:22 IST

పారిస్‌: భారత్‌ అభివృద్ధి చేసిన నగదు చెల్లింపుల వ్యవస్థ ‘యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌’(UPI) సేవలు ఫ్రాన్స్‌లోనూ ప్రారంభమయ్యాయి. తొలుత ప్రఖ్యాత పర్యాటక కేంద్రం ‘ఈఫిల్‌ టవర్‌ (Eiffel Tower)’ టికెట్ల బుకింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ‘యూపీఐ’ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆలోచనను అమలు చేసినట్లు ట్వీట్‌ చేసింది.

స్థానికంగా యూపీఐ సేవలను ప్రారంభించేందుకు ఇరుదేశాలు అంగీకరించినట్లు గతేడాది ఫ్రాన్స్‌ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేవలు భారత పర్యాటకులకు పెద్దఎత్తున ఉపయుక్తం కానున్నాయి. ఈఫిల్‌ టవర్‌ను సందర్శించాలనుకునే భారతీయులు ఇకనుంచి ఆన్‌లైన్‌లో యూపీఐ చెల్లింపుల ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) వెల్లడించింది. క్రమంగా సేవలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలుస్తోంది.

డిజిటల్‌ చెల్లింపులు..జర భద్రం

‘ఎన్‌పీసీఐ’కి చెందిన ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌ (NIPL).. ఫ్రాన్స్‌కు చెందిన లీరా సంస్థ భాగస్వామ్యంతో ఈ సేవలను ప్రవేశపెట్టింది. ‘ఎన్‌పీసీఐ’ 2016లో 21 బ్యాంకులతో కలిసి ఈ వ్యవస్థను భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలకు విశేష ఆదరణ లభించింది. యూఏఈ, భూటాన్‌, నేపాల్‌ వంటి దేశాల్లో ఇప్పటికే యూపీఐ సేవలు కొనసాగుతున్నాయి. అమెరికా, ఐరోపా, పశ్చిమ ఆసియా దేశాల్లో ఈ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు చర్చలు జరుపుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని