డిజిటల్‌ చెల్లింపులు..జర భద్రం

చేతిలో నగదుతో ఇప్పుడు పెద్దగా అవసరం ఉండటం లేదు. మొబైల్‌ ఫోనులో యూపీఐ యాప్‌ ఉంటే చాలు. క్షణాల్లో చెల్లింపులు పూర్తయిపోతాయి.

Updated : 05 Jan 2024 07:11 IST

చేతిలో నగదుతో ఇప్పుడు పెద్దగా అవసరం ఉండటం లేదు. మొబైల్‌ ఫోనులో యూపీఐ యాప్‌ ఉంటే చాలు. క్షణాల్లో చెల్లింపులు పూర్తయిపోతాయి. సౌలభ్యం మాటున కొన్నిసార్లు సవాళ్లూ ఉంటాయి. చిన్న అజాగ్రత్తతో మన కష్టార్జితం వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కాబట్టి, డిజిటల్‌ చెల్లింపుల్లో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.155 కోట్ల మేరకు సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళ్లాయి. క్రెడిట్‌ కార్డులు, డిజిటల్‌ చెల్లింపులపై అవగాహన ఉన్నవారూ కొన్నిసార్లు మోసాలకు బలి అవుతున్నారు. నగదు రహిత చెల్లింపులు అనివార్యం అవుతున్న ప్రస్తుత తరుణంలో.. మిమ్మల్ని మోసగాళ్లు ఎక్కడి నుంచి ఎలా లక్ష్యంగా చేసుకుంటారన్నది చెప్పలేం. ఈ రోజు పన్ను రిఫండ్‌ సందేశం కావచ్చు, రేపు మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడుల పేరుతో ఉండొచ్చు. ఇలా ఎప్పటికప్పుడు మోసాల పద్ధతి మారుతూనే ఉంటుంది. దీన్ని అరికట్టాలంటే.. మనమే బాధ్యతగా, మరింత అప్రమత్తంగా ఉండాలి.  

కేవైసీ పేరుతో.. ప్రధానంగా ఇప్పుడు వస్తున్న మోసపూరిత ఫోన్లన్నీ బ్యాంకులో కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) నిబంధనలను పాటించాలని చెబుతున్నవే. సాధారణంగా ఏడాది కొత్తలో బ్యాంకు నిబంధనల్లో కొన్ని మార్పులు రావడం సహజం. ఇవే మోసగాళ్లకు వరంగా మారుతుంటాయి. కేవైసీ, రీ-కేవైసీ పేరుతో ఖాతాదారులను సంప్రదిస్తుంటారు. ఒకవేళ మీ బ్యాంకు నుంచి నిజంగానే కేవైసీ చేయాల్సిందిగా సందేశం వచ్చిందనుకోండి. చాలా సందర్భాల్లో బ్యాంకు శాఖను సంప్రదించాల్సిందిగా సూచిస్తుంది. లేకపోతే బ్యాంకు వెబ్‌సైటులోకి లాగిన్‌ కావాల్సిందిగా చెబుతుంది. ఇలా కాకుండా...  సందేశంలో ఏదైనా లింకు వచ్చి, దాన్ని క్లిక్‌ చేయడం ద్వారా కేవైసీని పూర్తి చేయాల్సిందిగా చెబితే.. అది పూర్తిగా మోసపూరితమే. ఇలాంటి లింకుల్లో అడిగిన సమాచారాన్ని అందిస్తే, సైబర్‌ నేరగాళ్లు మీ ఖాతాపై పట్టు సాధించినట్లే.

ఎట్టి పరిస్థితుల్లోనూ మీ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు సీవీవీ, ఓటీపీ, పాస్‌వర్డ్‌లాంటివి ఎవరికీ చెప్పొద్దు. చిన్న అనుమానం వచ్చినా వెంటనే బ్యాంకును సంప్రదించి, ఫిర్యాదు చేయాలి.

గడువు తీరిపోతుందని..

డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను వాడినప్పుడు వచ్చే రివార్డు పాయింట్ల గడువు కొన్నాళ్లకు తీరిపోతుంది. ఇప్పుడు సైబర్‌ మోసగాళ్లు వీటిపై పడ్డారు. బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నట్లుగానే చెబుతూ.. రివార్డు పాయింట్లను వాడుకోవాల్సిందిగా సూచిస్తుంటారు. వాటి గడువు పెంచాలంటే.. కొన్ని వివరాలు చెప్పాల్సిందిగా అడుగుతారు. మీరు ఓటీపీలాంటి వివరాలు చెప్పగానే, మీ రివార్డు పాయింట్లతో వాళ్లు కొనుగోళ్లు చేస్తారు.

మీ క్రెడిట్‌ కార్డుపై రివార్డు పాయింట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోండి. వీలును బట్టి, వాటిని వాడుకోండి. ఈ పాయింట్ల గడువును బ్యాంకులు సాధారణంగా పెంచవు. కాబట్టి, ఇలాంటి సందేశాలు వస్తే నమ్మొద్దు.

వస్తువులు కొన్నారంటూ.. మోసగాళ్లు కొన్నిసార్లు మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంటారు. రూ.10వేల వస్తువును రూ.1,000 మీరు కొనుగోలు చేశారని, దాన్ని మీకు చేర్చాలంటే.. డబ్బు చెల్లించాలని అంటుంటారు. క్యూఆర్‌ కోడ్‌ను పంపించి, డిజిటల్‌లో చెల్లించాలని అడుగుతారు. మనం ఆ వస్తువును నిజంగా కొన్నామా లేదా అని ఆలోచించుకునే లోపే డబ్బు చెల్లించాలని, లేకపోతే క్యూఆర్‌ కోడ్‌ సమయం అయిపోతుందని తొందర పెట్టేస్తారు. మరికొన్నిసార్లు మీకు డబ్బు వస్తుందని, క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాల్సిందిగా చెబుతుంటారు.

  • గర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీరు డబ్బు పంపాలి అంటేనే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, పిన్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. డబ్బు మీ ఖాతాలోకి రావాలంటే.. ఎలాంటి కోడ్‌నూ స్కాన్‌ చేయొద్దు.
  • మీరు కొనుగోలు చేయని వస్తువు గురించి ఏ మాత్రం ఆలోచించొద్దు. వెంటనే ఆ ఫోన్‌ను కట్‌ చేయడం మేలు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

  • మన ఆర్థిక సమాచారాన్ని సురక్షితంగా ఉంచే యూపీఐ యాప్‌లనే వాడాలి. ఇప్పుడు చాలా బ్యాంకులు తమ యాప్‌ల నుంచి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, చెల్లింపులు పూర్తి చేసే వీలును కల్పిస్తున్నాయి. సాధ్యమైనంత వరకూ వీటిని వాడటమే మేలు.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ సులభమైన పాస్‌వర్డ్‌లను ఎంచుకోవద్దు. డిజిటల్‌ పేమెంట్‌ చెల్లింపులు చేసేటప్పుడు ఆరంకెల రహస్య సంఖ్యను వినియోగించాలి. పిన్‌ను కనీసం రెండు మూడు నెలలకోసారి మార్చడం ఉత్తమం.
  • ఉచిత వై-ఫై సౌకర్యాన్ని ఆర్థిక లావాదేవీలు చేసేందుకు బ్యాంకింగ్‌ లేదా యూపీఐ యాప్‌లను వాడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించుకోవద్దు.
  • మీ మొబైల్‌ ఫోనులో ఉన్న చెల్లింపుల యాప్‌లను వినియోగించుకోవాలంటే రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. యాప్‌ను ప్రారంభించేందుకు, లావాదేవీలు చేసేందుకు వేర్వేరు పాస్‌వర్డ్‌లు ఉండాలి. బయోమెట్రిక్‌నూ ఉపయోగించుకోవాలి.
  • చెల్లింపులు చేసేందుకు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, లావాదేవీని పూర్తి చేసేటప్పుడు ఒకసారి సంబంధిత దుకాణదారు లేదా వ్యక్తిని వచ్చిన పేరు గురించి అడిగి తెలుసుకోవాలి. వారు ధ్రువీకరించిన తర్వాతే చెల్లింపులుపూర్తి చేయాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని