UPI: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఆటో డెబిట్‌, ఆ యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు

UPI payments: ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను శుక్రవారం వెల్లడించింది. రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. మరోవైపు యూపీఐ, ఆటో డెబిట్‌ పరిమితి విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Updated : 08 Dec 2023 16:59 IST

UPI payments | ముంబయి: ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాల్లో భాగంగా ఆర్‌బీఐ (RBI) శుక్రవారం రెండు కీలక ప్రకటనలు చేసింది. ఆస్పత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ (UPI) ద్వారా చేసే చెల్లింపుల పరిమితిని, రికరింగ్‌ చెల్లింపుల కోసం ఇచ్చే ఇ-మ్యాండేట్ మొత్తాన్ని పెంచింది. ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం ఈ విషయాలను వెల్లడించారు. 

ప్రస్తుతం ఆస్పత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ (UPI payments) ద్వారా ఒకసారి రూ.1 లక్ష వరకు చెల్లించేందుకు అనుమతి ఉంది. తాజాగా దీన్ని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఫలితంగా ఆయా చోట్ల యూపీఐ ద్వారా భారీ మొత్తం చెల్లించే వెసులుబాటు వినియోగదారులకు లభించింది. 

రికరింగ్‌ చెల్లింపుల కోసం ఇచ్చే ఇ-మ్యాండేట్‌ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.15 వేల నుంచి తాజాగా ఆర్‌బీఐ రూ.1 లక్షకు పెంచింది. ఇప్పటి వరకు ఆటో డెబిట్‌ లావాదేవీ విలువ రూ.15 వేలు దాటినట్లయితే.. ‘అడిషనల్‌ ఫ్యాక్టర్‌ ఆఫ్‌ అథెంటికేషన్‌’ కింద కస్టమర్లు ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాలి. తాజా నిర్ణయంతో రూ.1 లక్ష వరకు ఎలాంటి అదనపు అథెంటికేషన్‌ అవసరం లేదు. ఫలితంగా క్రమం తప్పకుండా చేసే మ్యూచువల్‌ ఫండ్‌ సబ్‌స్క్రిప్షన్‌, బీమా ప్రీమియం, క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపులకు ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాల్సిన పని ఉండదు.

ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం..

ఫిన్‌టెక్‌ రంగానికి మరింత సహకారం అందించడం కోసం ‘ఫిన్‌టెక్‌ రిపాజిటరీ’ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ రంగంలోని అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని తెలిపింది. 2024 ఏప్రిల్‌ లేదా అంతకంటే ముందే దీన్ని ఆర్‌బీఐ ఇన్నోవేషన్‌ హబ్‌ అందుబాటులోకి తీసుకొస్తుందని పేర్కొంది. ఈ రిపాజిటరీకి అవసరమైన సమాచారాన్ని స్వచ్ఛందంగా ఇచ్చేలా ఫిన్‌టెక్‌లను ప్రోత్సహిస్తామని చెప్పింది. దేశంలోని బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 

మరోవైపు ఆర్థిక రంగం కోసం దేశంలో ‘క్లౌడ్‌ ఫెసిలిటీ’ని ఏర్పాటు చేసే అంశాన్నీ ఆర్‌బీఐ పరిశీలిస్తోందని శక్తికాంత దాస్‌ వెల్లడించారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెద్ద ఎత్తున డేటాను నిర్వహిస్తున్నాయన్నారు. ఇందుకోసం క్లౌడ్‌ ఫెసిలిటీలను వాడుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సరికొత్త వసతులను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఆర్‌బీఐ ఉందన్నారు.

కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్‌బీఐ నేడు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రెపోరేటు 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగనుంది. కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం ఇది వరుసగా ఐదోసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు