Apple: యాపిల్‌కు వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం దావా

యాపిల్‌ సంస్థ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గుత్తాధిపత్యం కోసం చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని అమెరికా న్యాయశాఖ ఆరోపించింది.

Published : 21 Mar 2024 23:59 IST

వాషింగ్టన్‌: స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో గుత్తాధిపత్యం కోసం యాపిల్‌ (Apple) సంస్థ చట్ట విరుద్ధంగా వ్యహరించిందని అమెరికా (USA) న్యాయశాఖ ఆరోపించింది. ఈ మేరకు యాపిల్‌కు వ్యతిరేకంగా న్యూజెర్సీలోని ఫెడరల్‌ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దాంతోపాటు యూఎస్‌లోని 16 రాష్ట్రాల అటార్ని జనరల్స్‌ కూడా సంస్థపై ఫిర్యాదు చేశారు. యాపిల్‌ ఐఫోన్‌తోపాటు ఐపాడ్‌, మ్యాక్‌ కంప్యూటర్లు, యాపిల్‌ వాచ్‌ వంటి ఉత్పత్తుల్లో హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ల వినియోగానికి నిర్దేశించిన నిబంధనలు యూజర్లపై భారం మోపే విధంగా ఉన్నాయని ఆరోపించారు. దీంతో యాపిల్‌ యూజర్లు తప్పనిసరిగా అధిక ధర చెల్లించి వాటిని కొనుగోలు చేయడంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా యాపిల్‌ అవతరించిందని తెలిపారు. అదే విధంగా యూజర్లు యాపిల్‌ ఉత్పత్తుల నుంచి ఇతర డివైజ్‌లకు మారే ప్రక్రియను కఠినతరంగా రూపొందించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతోపాటు యాప్‌ స్టోర్‌లో కూడా పారదర్శకమైన నిబంధనలు పాటించలేదని వ్యాజ్యంలో ఆరోపించారు. 

స్మార్ట్‌ డివైజ్‌తో మీ పనులు ఈజీ.. ఇక ఫోన్‌ అక్కర్లేదేమో!

యాపిల్‌ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. యూజర్లు తమ వ్యక్తిగత సమాచారానికి పటిష్ఠమైన భద్రత అందించే సంస్థలను ఎంచుకున్నారని తెలిపింది. తాజా ఫిర్యాదుతో గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో యాపిల్‌ షేర్ల ధరలు తగ్గాయి. మరోవైపు కృత్రిమమేధ ఆధారిత ఉత్పత్తుల తయారీలో గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థల కంటే యాపిల్ వెనుబడి ఉందనే భయాలు కంపెనీ షేర్ల విలువ తగ్గటానికి మరో కారణంగా మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మార్కెట్‌లో గుత్తాధిపత్యం కోసం చట్ట విరుద్ధంగా వ్యవహరించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని బైడెన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా సంస్థలకు వ్యతిరేకంగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని