Ai pin: స్మార్ట్‌ డివైజ్‌తో మీ పనులు ఈజీ.. ఇక ఫోన్‌ అక్కర్లేదేమో!

Humane Ai Pin: హ్యూమన్‌ ఏఐ పిన్‌.. స్మార్ట్‌ఫోన్‌కు సవాలు విసురుతోంది. ఫోన్‌ చేయగలిగే అన్ని పనులూ చేసేస్తూ ఔరా అనిపిస్తోంది.

Published : 22 Mar 2024 00:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాల్స్‌ కోసం మన ఇళ్లల్లోకి వచ్చిన టెలిఫోన్‌.. ఇప్పుడు ప్రతి మనిషికీ తానే సర్వస్వం అనేలా మారిపోయింది. అది లేకుండా జీవితం గడవడం కష్టమనేలా అయిపోయింది. వెంట తీసుకెళ్లకపోతే ఏదో కోల్పోయామన్న భావన సైతం కొందరిలో వెంటాడుతుంటుంది. అలాంటి స్మార్ట్‌ఫోన్‌ స్థానాన్ని తాను భర్తీ చేస్తానంటోంది ఈ బుల్లి డివైజ్‌. దాని పేరు ఏఐ పిన్‌ (Ai Pin). అమెరికాకు చెందిన స్టార్టప్‌ హ్యుమేన్‌ (Humane) దీన్ని రూపొందించింది. గతేడాది జులైలో ఈ డివైజ్ ను ఆవిష్కరించారు. ఇటీవల జరిగిన MWC ఈవెంట్‌లోనూ దీన్ని ప్రదర్శించారు. త్వరలో దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

ఏఐ పిన్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎక్లిప్స్‌ మోడల్ 699 డాలర్లు, లూనర్‌ 799 డాలర్లు, ఈక్వినాక్స్‌ మోడల్‌ 799 డాలర్లుగా నిర్ణయించారు. ఇప్పటికే ఆర్డర్‌ పెట్టిన వాళ్లకు ఏప్రిల్‌ 11 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు ఆర్డర్‌ చేస్తే మే నెలకు డెలివరీలు అందిస్తామని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే దీన్ని డెలివరీ చేస్తోంది. ఇతర దేశాలకూ త్వరలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒకవేళ భారత్‌లో ఎవరైనా కొనుగోలు చేయాలంటే రిజిస్టర్‌ చేసుకోవాలని కంపెనీ తన వెబ్‌సైట్‌లో సూచిస్తోంది. మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చినప్పుడు నోటిఫికేషన్‌ ద్వారా తెలియజేస్తుంది.

వాట్సప్‌ కొత్త ఫీచర్‌.. త్వరలో టెక్ట్స్‌ రూపంలోకి వాయిస్‌ మెసేజ్‌!

ఏఐ పిన్‌ (AI pin) అనేది ఎలాంటి స్క్రీనూ లేని ఓ వేరియబుల్‌ డివైజ్‌. ఆకారంలో చిన్నగా.. తక్కువ బరువుతో ఉంటుంది. మన దుస్తులకు ఎక్కడైనా అతికించొచ్చు. ఇది స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీంట్లో కెమెరా, మైక్రోఫోన్‌, యాక్సెలరీ మీటర్‌ వంటి సెన్సర్లు ఉంటాయి. దీంట్లో ఎలాంటి స్క్రీనూ ఉండదు. ఒకవేళ ఏదైనా సమాచారం చూడాలంటే ఇందులోని బిల్ట్‌-ఇన్‌ ప్రొజెక్టర్‌ సాయంతో మీ అరచేయి లేదా ఏదైనా వస్తువును డిస్‌ప్లేగా వినియోగించుకోవచ్చు.

టాప్‌ ఫీచర్లు ఇవే..

  • కాల్స్‌, మెసేజులు: ఈ బుల్లి డివైజ్‌ను మొబైల్‌లానే కాల్స్‌, మెసేజ్‌లకు వినియోగించుకోవచ్చు. వాయిస్‌ కమాండ్‌ ద్వారా కాల్‌ చేసి ఎవరితోనైనా మాట్లాడొచ్చు. సందేశాలు పంపించొచ్చు.
  • అరచేతిలో సమాచారం: స్టాక్‌ మార్కెట్‌, క్రికెట్‌ స్కోర్‌.. ఇలా ఏదైనా సమాచారం కళ్లతో చూడాలనుకుంటే ఇందులోని ప్రొజెక్టర్‌ను వినియోగించుకోవచ్చు. అప్పటికప్పుడు మీ అరచేతినే డిస్‌ప్లేగా మార్చుకోవచ్చు.
  • కెమెరా, వీడియో రికార్డింగ్‌: స్మార్ట్‌ఫోన్‌లానే ఏఐ పిన్‌ సాయంతో ఫొటోలు తీయొచ్చు. వీడియోనూ రికార్డ్‌ చేయొచ్చు. మీడియా ప్లేబ్యాక్‌ను సైతం కంట్రోల్‌ చేయొచ్చు.
  • రిమైండర్‌ సెట్‌: అప్పటికప్పుడు ఏదైనా రాసుకోవడానికి మన స్మార్ట్‌ ఫంక్షన్‌లో నోట్స్‌ను వినియోగిస్తాం. ఆ ఫీచర్‌ ఇందులోనూ ఉంది. కావాలనుకుంటే రిమైండర్లు సైతం సెట్‌ చేసుకోవచ్చు.
  • వెబ్‌ సెర్చ్‌: ఏదైనా సమాచారం కావాలంటే ఏఐ పిన్‌ ఇంటర్నెట్‌లోని సమాచారం సైతం అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అవసరమైతే విషయాన్ని క్లుప్తంగా ఇస్తుందని పేర్కొంది.
  • లైవ్‌ ట్రాన్స్‌లేట్‌: ఏఐ పిన్‌ 50 భాషలకు సపోర్ట్‌ చేస్తుంది. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు లైవ్‌లో ట్రాన్స్‌లేషన్ చేసేస్తుందట.
  • ఇమేజ్‌ రికగ్నిషన్‌: ఏదైనా ఇమేజ్‌ను క్యాప్చర్‌ చేస్తే చాలు.. దానికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలన్నీ ఈ ఏఐ పిన్‌ తెలియజేస్తుంది. ఉదాహరణకు షూను ఫొటో తీస్తే అది ఏ కంపెనీ తయారుచేసిందో చెప్తుంది. ఒక కేక్‌ను ఫొటో తీస్తే దాన్లో ఎన్ని క్యాలరీలు దాగున్నాయో బయటపెడుతుంది. ఈ బుల్లి డివైజ్‌ను కావాలనుకుంటే కంప్యూటర్‌కు సైతం కనెక్ట్ చేయొచ్చు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని