Union Budget 2024: మధ్యంతర బడ్జెట్‌.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Union Budget 2024: ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో మధ్య తరగతి, రైతులకు సానుకూలంగా ప్రకటనలు వెలువడ్డాయి. కానీ, కొన్ని రంగాల వారికి ఆశించిన ప్రకటనలు రాలేదు.

Updated : 01 Feb 2024 19:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) గురువారం మధ్యంతర బడ్జెట్‌ (Union Budget 2024)ను ప్రవేశపెట్టారు. కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న వేళ రైతులు, పేదలను ఆకర్షించేలా కేంద్ర పద్దులో కొన్ని ప్రకటనలు వెలువడ్డాయి. పర్యటకం, హౌసింగ్‌ రంగాల అభివృద్ధికి కేటాయింపులు చేసినా, అదే సమయంలో కొన్ని రంగాల వారికి నిరాశే మిగిలింది. మరి ఈ తాత్కాలిక పద్దుతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఓసారి చూద్దాం.

వీరికి ప్రయోజనకరం

  • బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం దక్కింది. సాగులో ప్రైవేటు, ప్రభుత్వ పెట్టుబడులు పెంచే దిశగా, నూనె గింజల ఉత్పత్తిలో స్వావలంబన సాధించేలా కేంద్రం ప్రకటనలు చేసింది. దీంతో పాటు పాడి రైతుల అభివృద్ధి, మత్స్య సంపద పెంచేందుకు పథకాలను తీసుకురానుంది.
  • బస్తీలు, అద్దె ఇళ్లల్లో నివసించేవారు తమ సొంతింటి కలను సాకారం చేసుకునే దిశగా ‘హౌసింగ్‌ స్కీమ్‌’ను తీసుకురానున్నారు. సామాన్యులపై విద్యుత్తు బిల్లుల భారం తగ్గించేలా ‘రూఫ్‌ టాప్‌ సోలారైజేషన్‌’ పథకాన్ని అమలు చేయనున్నారు.
  • పద్దులో పర్యటక రంగానికి కేంద్రం పెద్దపీట వేసింది. పర్యటక కేంద్రాలను అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో మార్కెట్‌ కల్పించేలా రాష్ట్రాలను ప్రోత్సహించనుంది. ఇందు కోసం దీర్ఘకాల వడ్డీ రహిత రుణాలను ఇవ్వనుంది.

‘టార్గెట్‌ లక్షద్వీప్‌’ దిశగా బడ్జెట్‌లో అడుగులు..!

ఈ రంగాలకు నిరాశే..

  • మౌలిక వసతుల రంగానికి 11.11 శాతం వృద్ధితో రూ.11.11 లక్షల కోట్లను కేటాయించారు. అయితే, ఈ రంగంలో ఉన్న సవాళ్లను పరిష్కరించేందుకు ఈ పెట్టుబడులు మరింత పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
  • దేశంలో విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని మరింత పెంచాలని కేంద్రం భావిస్తోంది. కానీ, ఇందుకు అవసరమైన 1.2 బిలియన్‌ డాలర్ల సబ్సిడీ ప్రోగ్రామ్‌ ఈ ఏడాది మార్చితో ముగియనుంది. దీని పొడిగింపుపై బడ్జెట్‌లో ప్రకటన చేయలేదు. 
  • బంగారం దిగుమతులపై ప్రస్తుతం 15 శాతం సుంకం విధిస్తోంది. దీని వల్ల దేశంలోకి పసిడి అక్రమ రవాణా పెరిగిందని... సుంకాన్ని తగ్గించాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్‌ చేశాయి. కానీ, ఇందుకు అనుగుణంగా బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఈ నేపథ్యంలోనే స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో ఆయా షేర్లు నష్టపోయాయి.
  • పద్దులో వేతన జీవులకు ఊరట లభించలేదు. ఎన్నికల నేపథ్యంలో పన్ను విధానాల్లో మార్పుల జోలికి కేంద్రం వెళ్లలేదు. అయితే, ప్రత్యక్ష పన్నులకు సంబంధించి వివాదాస్పద డిమాండ్‌ నోటీసులు అందుకున్న వారికి ఉపశమనం కల్పించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని