iPhone: ఐఫోన్‌లో ‘స్టోలెన్‌ డివైజ్‌ ప్రొటెక్షన్‌’.. పాస్‌కోడ్‌ తెలిసినా వాడలేరు!

iPhone: ఐఫోన్‌ లేదా ఐప్యాడ్‌ వినియోగిస్తున్నారా? మీ కోసమే యాపిల్ స్టోలెన్‌ డివైజ్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. డివైజ్ దొంగతనానికి గురైనప్పుడు ముఖ్యమైన సమాచారం కోల్పోకుండా ఇది ఉపయోగపడుతుంది.

Published : 26 Jan 2024 02:46 IST

iPhone | ఇంటర్నెట్‌డెస్క్‌: పెద్ద బహిరంగ సభ జరుగుతోంది. పాకెట్‌లో ఉన్న ఐఫోన్‌ను మీరు పదే పదే లాక్‌ తీసి యాక్సెస్‌ చేస్తుంటారు. అలాంటి సందర్భంలో అప్పటికే మీ ఫోన్‌పై కన్నేసిన కేటుగాడికి పాస్‌వర్డ్ తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. ఆ సభలో లీనమైపోయిన దశలో ఫోన్‌ కొట్టేస్తే.. ఫోన్‌ను తెరవడం, అందులోని డేటాను చెరిపేయడం పెద్ద విషయం కాదు. పాస్‌వర్డ్‌ తెలీకపోతేనే ఏమీ చేయలేని ఇప్పటి పరిస్థితుల్లో.. సర్వం తెలిశాక ఇలాంటి ఉదంతం జరిగితే అడ్డుకోవడం కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లోనూ మీ ఐఫోన్‌/ ఐప్యాడ్‌ డివైజులను దొంగతనాల నుంచి రక్షించుకోవచ్చంటోంది యాపిల్‌. ఇందుకోసం కొత్తగా ‘స్టోలెన్‌ డివైజ్‌ ప్రొటెక్షన్‌’ పేరిట కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.

సాధారణంగా దొంగిలించిన ఫోన్‌ పాస్‌వర్డ్‌ తెలిసినప్పుడు ఫోన్‌లోని డేటాను తొలగించి దాన్ని విక్రయించాలని చూస్తుంటారు. కానీ యాపిల్‌ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో దీన్ని అడ్డుకోవచ్చు. యాపిల్‌ తన లేటెస్ట్‌ ఐఓఎస్‌ వెర్షన్‌ 17.3లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి దీన్ని ఆన్‌ చేసుకోవచ్చు. ‘స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్’ ఆన్‌ చేసుకుంటే.. ఐఫోన్‌ లేదా ట్యాబ్‌లను వినియోగిస్తున్న వారి ఇల్లు, కార్యాలయాలను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తుంటుంది. ఇలా తరచూ వెళ్లే ప్రదేశాలు కాకుండా వేరే చోట డివైజ్‌ను యాక్సెస్‌ చేసినప్పుడు స్టోలెన్‌ డివైజ్‌ తన పని మొదలుపెడుతుంది. మీ ఫోన్‌/ట్యాబ్‌కు అదనపు సెక్యూరిటీని యాడ్‌ చేస్తుంది. డివైజులను యాక్సెస్‌ చేయాలంటే కచ్చితంగా ఫేస్‌ఐడీ లేదా టచ్‌ ఐడీ స్కాన్‌ వినియోగాన్ని తప్పనిసరి చేస్తుంది. ఈ ఫీచర్‌ను యాపిల్‌ యూజర్లు వినియోగించుకోవాలని సంస్థ సూచిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని