Anant-radhika: ‘అందుకే జామ్‌నగర్ ఎంచుకున్నాం’: ప్రీవెడ్డింగ్ వేదికపై అనంత్ స్పందన

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర అంశాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో జామ్‌నగర్ వేదికను ఎంచుకోవడంపై అనంత్(Anant Ambani) స్పందించారు. 

Published : 28 Feb 2024 13:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ(Mukesh Ambani) చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్(Anant Ambani-radhika merchant) ప్రీ వెడ్డింగ్‌ వేడుకలపైనే ఇప్పుడు అందరి దృష్టి. ఈ మూడురోజుల సంబరాలకు అంతర్జాతీయ అతిథులు హాజరవుతున్నారు. ఈ రేంజ్‌ ఈవెంట్స్‌కు గుజరాత్‌(Gujarat)లోని జామ్‌నగర్‌ (Jamnagar)ను ఎంచుకోవడం ఆసక్తిగా మారింది. దీని గురించి జాతీయ మీడియాతో అనంత్ మాట్లాడారు.

‘‘నేను ఇక్కడే పెరిగాను. ఇక్కడ వేడుక జరుగుతుండటం నా అదృష్టం. ఇది మా నానమ్మ జన్మభూమి. మా తాతయ్య, నాన్న కర్మభూమి. ఇది మీ తాతయ్య అత్తిల్లు అంటూ మా నాన్న తరచూ చెప్తుంటారు. భారత్‌లోనే వివాహాలు చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చినప్పుడు నాకు ఎంతో గర్వంగా అనిపించింది. ఇది నా ఇల్లు’’ అంటూ అనంత్ స్పందించారు.

అనంత్‌-రాధిక ప్రీవెడ్డింగ్‌.. ఈ విశేషాలు తెలుసా..!

విదేశాల్లో వివాహ వేడుకలు (Destination Wedding) చేసుకుంటున్న భారతీయ యువ జంటలకు కొద్దినెలల క్రితం మోదీ సూచన చేసిన సంగతి తెలిసిందే. ‘‘మేకిన్‌ ఇండియా (Make In India) తరహాలో దేశంలో ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ (Wed in India) ప్రారంభం కావాలి. భారత్‌లో పెళ్లి చేసుకునే జంటలను దేవుడు కలుపుతాడని విశ్వసిస్తారు. అలాంటప్పుడు దేవుడు కలిపిన జంటలు తమ జీవితంలో నూతన ప్రయాణాన్ని (పెళ్లి) విదేశాలకు వెళ్లి ఎందుకు ప్రారంభిస్తున్నాయి? యువ జంటలు వెడ్డింగ్ డెస్టినేషన్ గురించి ఆలోచించాలి’’ అని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

రాధిక నా వెన్నంటి నిలిచింది: అనంత్‌

తాను ఆరోగ్యసమస్యలతో ఇబ్బందిపడుతోన్న సమయంలో రాధికా మర్చంట్ ఎంతో అండగా నిలిచిందని అనంత్ వెల్లడించారు. ‘నా జీవితంలో ఆమె ఉండటం నా అదృష్టం. ఆమె నా కలలరాణి. ఎప్పుడూ మూగజీవాల సంరక్షణ గురించి ఆలోచించే నేను.. వైవాహిక జీవితంలోకి అడుగుపెడతానని అనుకోలేదు. కానీ రాధికను కలిసిన తర్వాత మొత్తం మారింది. మా ఆలోచనలు కలిశాయి. ఆమె మూగజీవాల పట్ల దయతో ఉంటుంది. నేను  ఆరోగ్యపరంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న సమయంలో కొండంత అండగా నిలిచింది’ అని రాధికపై తన ప్రేమను వ్యక్తం చేశారు. అనంత్ చిన్నప్పటి నుంచి ఊబకాయంతో బాధపడుతున్నారు. తన కుమారుడికి ఆస్థమా ఉండటంతో, బరువు తగ్గడం చాలా కష్టంగా మారిందని గతంలో నీతా అంబానీ వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. ఈ ప్రీవెడ్డింగ్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికరవిషయాలు తెలుస్తున్నాయి. అతిథులకు వడ్డించేందుకు ప్రత్యేక మెనూ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ నుంచి 21 మంది చెఫ్‌లను పిలిపించినట్లు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఆహ్వానితులకు భారతీయ వంటకాలతో పాటు జపనీస్‌, మెక్సికన్‌, థాయ్‌, పార్సీ ఇలా పలు సంప్రదాయ వంటలను రుచి చూపించనున్నారు. మొత్తంగా 2,500 వంటకాలను అతిథులకు వడ్డించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని