Piyush Goyal: 10 కోట్ల చిరు వ్యాపారులను కాపాడతాం: గోయల్‌

Eenadu icon
By Business News Team Published : 12 Sep 2024 00:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్‌ ధోరణిపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆ విధానానికి వ్యతిరేకం కాదన్న ఆయన.. అటువంటి వాటి నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న 10కోట్ల మంది చిరు వ్యాపారుల ప్రయోజనాలను కాపాడతామన్నారు. భారత్‌-అమెరికా బిజినెస్‌ కౌన్సిల్‌ను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించారు.

‘‘140 కోట్ల ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, వారి భవిష్యత్తు, 14కోట్ల మంది రైతు కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నాం. అదే విధంగా 10 కోట్ల మంది చిరు వ్యాపారుల ప్రయోజనాలను కాపాడతాం. అమెరికాలో కనుమరుగైనటువంటి చిరు దుకాణ వ్యవస్థను ఇక్కడ కాపాడుకునేందుకు కనీస ప్రయత్నం చేస్తున్నాం’’ అని పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. అక్టోబర్‌ 2-3 తేదీల్లో వాషింగ్టన్‌లో ఇరుదేశాల సీఈవోల ఫోరం సదస్సులో మరిన్ని వాణిజ్య చర్చలు జరుపుతామన్నారు. కీలకమైన ఖనిజాలకు సంబంధించి ఇరు దేశాలకు ఒకేవిధమైన ఆందోళనలు ఉన్నాయన్న ఆయన.. సంబంధిత రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ- కామర్స్‌ కల్చర్‌పై ఆందోళన వ్యక్తం చేసిన గోయల్‌.. ఈ తరహా సంస్థలు పుట్టుకొస్తుండడాన్ని గొప్ప విజయంగా భావించరాదంటూ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరుసటి రోజు దీనిపైనే స్పందిస్తూ.. ఈ- కామర్స్‌ సంస్థలకు భారత్‌ వ్యతిరేకం కాదని, ఆ సంస్థలు న్యాయంగా, నిజాయితీగా వ్యాపారాలను సాగించాలని మాత్రమే ప్రభుత్వం కోరుకుంటోందని స్పష్టతనిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు