Wipro: విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత

Wipro Q4 results: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది.

Published : 19 Apr 2024 19:14 IST

Wipro Q4 results | దిల్లీ: దేశీయ ఐటీ సేవల సంస్థ విప్రో (Wipro) నాలుగో త్రైమాసిక (Q4 Results) ఫలితాల్ని శుక్రవారం ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.2,835 కోట్ల ఏకీకృత లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,074.5 కోట్లతో పోలిస్తే 7.9 శాతం క్షీణత నమోదు చేసింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.23,190.3 కోట్ల నుంచి 4.2 శాతం తగ్గి రూ.22,208.3 కోట్లుగా నమోదైందని విప్రో తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 2.6 శాతం క్షీణించి రూ.11,045 కోట్లుగా నమోదైంది. ఆదాయం 0.8 శాతం క్షీణించి రూ.89,760.3 కోట్లుగా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ అనేక సవాళ్లను ఎదుర్కొందని కంపెనీకి కొత్తగా నియమితులైన సీఈఓ, ఎండీ శ్రీనివాస్‌ పల్లియా పేర్కొన్నారు. అవకాశాలపై ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపారు. వచ్చే త్రైమాసికంలో ఆదాయంలో స్థిర ధరల వద్ద -1.5 - +0.5 శాతం మధ్య వృద్ధి నమోదుకావొచ్చని అంచనాలు వెలువరించారు. గతేడాదితో పోలిస్తే విప్రో ఉద్యోగుల సంఖ్య 9.1 శాతం క్షీణించి 2,34,054కి చేరింది.

మెటా ప్లాట్‌ఫామ్స్‌లో ఏఐ.. వాట్సప్‌లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!

రిషద్ ఎ ప్రేమ్‌జీని ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా తిరిగి నియమించేందుకు విప్రో బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జులై 31 నుంచి 2029 జులై 30 వరకు అంటే ఐదేళ్ల కాలానికి ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. అలాగే, నాన్‌ అజీమ్‌ హెచ్‌ ప్రేమ్‌జీని నాన్ ఎగ్జిక్యూటివ్‌, స్వతంత్ర డైరెక్టర్‌గా ఐదేళ్ల పాటు తిరిగి నియమించేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు విప్రో తన ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఫలితాల నేపథ్యంలో మార్కెట్‌ ముగిసేసరికి  విప్రో షేరు విలువ 1.74 శాతం పెరిగి రూ.452.10 వద్ద స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని