Elon Musk: మస్క్‌కు షాకిచ్చిన శాన్‌ఫ్రాన్సిస్కో యంత్రాంగం.. కార్యాలయంపై ఎక్స్‌ లోగో తొలగింపు

ఎలాన్‌ మస్క్‌కు శాన్‌ఫ్రాన్సిస్కో యంత్రాంగం షాకిచ్చింది. ఎక్స్ ప్రధాన కార్యాలయంపై ఏర్పాటు చేసిన లోగో నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దాని వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో దాన్ని తొలగించారు. 

Updated : 01 Aug 2023 11:26 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌(Twitter)ను ఓ సూపర్‌ యాప్‌గా మార్చే క్రమంలో దాని పేరును ఎక్స్‌ (X)గా మార్చారు ఎలాన్‌ మస్క్‌(Elon Musk). దీంతో ట్విటర్‌ పిట్ట స్థానంలో X లోగో వచ్చి చేరింది. ఇందులో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కో(San Fransisco)లోని ప్రధాన కార్యాలయంపై ఎక్స్‌ లోగోను ఏర్పాటు చేశారు. అయితే, దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో శాన్‌ఫ్రాన్సిస్కో నగర యంత్రాంగం లోగోను తొలగించింది. ఎక్స్‌ లోగో డిస్‌ప్లేలో అమర్చిన ప్రకాశవంతమైన లైట్ల కారణంగా రాత్రుళ్లు ఆ కాంతి నేరుగా తమ ఇళ్లలోకి పడుతుందని, దానివల్ల నిద్రకు భంగం కలుగుతోందని 24 మంది స్థానికులు ఫిర్యాదు చేయడంతో లోగోను తొలగించినట్లు శాన్‌ఫ్రాన్సిస్కో సిబ్బంది తెలిపారు.

‘‘ఎక్స్‌ లోగోపై మాకు 24 మంది ఫిర్యాదు చేశారు. ఆ లోగోను అనుమతి లేకుండా ఏర్పాటు చేయడమే కాకుండా, దాని నుంచి వెలువడే కాంతి వల్ల రాత్రిళ్లు తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.  స్థానికుల ఫిర్యాదుతో మా బృందం లోగో ఏర్పాటును సమీక్షించి, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినట్లు నిర్ధారించింది. దీంతో దాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేశాం’’ అని శాన్‌ఫ్రాన్సిస్కో భవనాల తనిఖీ విభాగం అధికారి పాట్రిక్‌ హన్నన్‌ తెలిపారు.

ఐటీ రిటర్నులు ఫైల్‌ చేశారా... రిఫండ్ల విషయంలో ఈ తప్పులొద్దు!

అంతకుముందు ఎక్స్‌ లోగో ఏర్పాటుపై శాన్‌ఫ్రాన్సిస్కో నగర యంత్రాంగం సైతం విచారణకు ఆదేశించింది. ఒక సంస్థ లోగో గుర్తును మార్చాలనుకున్నప్పుడు డిజైన్‌, భద్రత కారణాల దృష్ట్యా ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ సిబ్బంది ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా లోగో ఏర్పాటు చేయడం, దానిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో తొలగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని