Elon Musk: ‘ఎక్స్‌’లో మరో మార్పు.. ఆదాయం తగ్గుతున్న తరుణంలో మస్క్‌ కీలక నిర్ణయం!

Elon Musk: సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’ విషయంలో గత నెలలో తీసుకున్న ఓ నిర్ణయాన్ని ఎలాన్‌ మస్క్‌ ఉపసంహరించుకున్నారు. ఎక్స్‌ వేదికపై షేర్‌ చేసే లింక్స్‌కు హెడ్‌లైన్‌ కనిపించేలా తిరిగి మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు.

Updated : 23 Nov 2023 16:32 IST

వాషింగ్టన్‌: దిగ్గజ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (Social Media X)లో వాణిజ్య ప్రకటనల నుంచి వచ్చే ఆదాయం పడిపోతున్న నేపథ్యంలో దాని అధిపతి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వేదికపై షేర్‌ చేసే లింక్స్‌కు సంబంధించిన హెడ్‌లైన్లు కనిపించేలా తిరిగి మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే, గతంలో వలే కాకుండా ఇకపై ఇమేజ్‌లపైనే లింక్‌కు సంబంధించిన హెడ్‌లైన్‌ కనిపిస్తుందని పేర్కొన్నారు.

పునరుద్ధరిస్తున్న ఈ హెడ్‌లైన్‌ ఆప్షన్‌కు సంబంధించి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఇతర వివరాలను వెల్లడించలేదు. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? అసలు ఇమేజ్‌పై హెడ్‌లైన్‌ను ఎలా చూపించనున్నారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. లింక్‌ ప్రివ్యూలకు సంబంధించిన హెడ్‌లైన్లు కనిపించకుండా ‘ఎక్స్‌’ (Social Media X)లో అక్టోబరులో మార్పులు చేసిన విషయం తెలిసిందే. దాదాపు నెల వ్యవధిలోనే తిరిగి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనుండటం గమనార్హం.

అక్టోబరులో చేసిన ఆ మార్పుతో వార్తలు, వ్యాసాలకు సంబంధించిన లింక్‌లు కనిపించే విధానమే మారిపోయింది. విషయం తెలుసుకోవడానికి యూజర్లు లీడ్‌ ఇమేజ్‌ పైభాగంలో కనిపించే లింక్‌పై కచ్చితంగా క్లిక్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వార్త, ప్రచురణ సంస్థలు లీడ్‌ ఇమేజ్‌పైనే హెడ్‌లైన్‌ను రాయడం మొదలుపెట్టాయి.

ఎక్స్‌ (Social Media X)పై యూజర్లు వెచ్చించే సమయాన్ని పెంచడం కోసం పలు మార్పులు చేస్తున్నట్లు మస్క్‌ ఇప్పటికే ప్రకటించారు. హెడ్‌లైన్‌ కనిపించడం వల్ల దృష్టి దానిపైకి మళ్లి యూజర్లు లింక్‌పై క్లిక్‌ చేసి ప్లాట్‌ఫామ్‌ నుంచి బయటకు వెళ్లిపోతున్నారని ఆయన వివరించారు. పైగా లింక్స్‌ను కాకుండా నేరుగా కంటెంట్‌నే పోస్ట్‌ చేయాలని మస్క్‌ ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా ఎంగేజ్‌మెంట్‌ పెరుగుతుందని ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని