Xiaomi: రెడ్‌మీ కొత్త వైఫై ట్యాబ్‌.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్‌ క్లీనర్‌

Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్‌ ఉత్పత్తులను భారత్‌లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్‌, బడ్స్‌, క్లీనర్‌, స్టీమర్‌ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..!

Published : 23 Apr 2024 15:34 IST

Xiaomi | ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘స్మార్టర్‌ లివింగ్‌’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో షావోమి పలు కొత్త ప్రొడక్ట్‌లను విడుదల చేసింది. వీటిలో రెడ్‌మీ ప్యాడ్‌ ఎస్‌ఈ, బడ్స్‌ 5ఏ, రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ ఎస్‌10, గార్మెంట్‌ స్టీమర్‌ ఉన్నాయి. ప్యాడ్‌ ప్రారంభ ధర రూ.12,999 కాగా.. స్టీమర్‌ రూ.2,299 నుంచి లభిస్తోంది. ఆయా డివైజ్‌ల ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..!

రెడ్‌మీ ప్యాడ్‌ ఎస్‌ఈ ఫీచర్లు, ధర..

ఈ ప్యాడ్‌ను 11 అంగుళాల ఎల్‌సీడీ డిప్‌స్లేతో తీసుకొచ్చారు. 6ఎన్‌ఎం ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఎంఐయూఐ ప్యాడ్‌ 14 సిస్టమ్‌తో పని చేస్తుంది. వెనక 8ఎంపీ, ముందు 5ఎంపీ కెమెరా ఇచ్చారు. వైఫై, బ్లూటూత్‌ 5.2 కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 10వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 8,000 ఎంఏహెచ్‌ బ్యాటరీని పొందుపర్చారు. దీంట్లో మూడు వేరియంట్లు ఉన్నాయి. 4జీబీ+128జీబీ ధర రూ.12,999, 6జీబీ+128జీబీ ధర రూ.13,999, 8జీబీ+128జీబీ ధర రూ.14,999. లాంచింగ్‌ సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో కొనుగోలు చేసేవారికి రూ.1,000 తక్షణ రాయితీ ఇస్తున్నారు. గ్రాఫైట్‌ గ్రే, లావెండర్‌ పర్పుల్‌, మింట్‌ గ్రీన్‌ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. ఏప్రిల్‌ 24 నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ షావోమి రిటైల్‌ స్టోర్లలో లభిస్తాయి.

రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ ఎస్10..

శుభ్రం చేయాలనుకున్న ఏరియాను అత్యంత కచ్చితత్వంతో మ్యాప్‌ చేసేలా రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ ఎస్‌10లో అత్యాధునిక నావిగేషన్‌ వ్యవస్థను పొందుపర్చారు. జిగ్‌జాగ్‌, వై ఆకారపు రూట్లలోనూ క్లీన్‌ చేసేలా దీన్ని రూపొందించారు. మొండి మరకలు, చెత్తను సైతం శుభ్రం చేసేలా 4000Pa టర్బో సక్షన్‌ పవర్‌తో ఇది పని చేస్తుంది. లాంచ్‌ సందర్భంగా రూ.1,000 రాయితీతో కలిపి దీన్ని రూ.19,999 ప్రత్యేక ధర వద్ద కొనుగోలు చేయొచ్చు. మే 6 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి.

రెడ్‌మీ బడ్స్‌ 5ఏ ధర, ఫీచర్లు..

రెడ్‌మీ బడ్స్‌ 5ఏ 25 డెసిబుల్స్‌ వరకు యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో వస్తోంది. 12 ఎంఎం డ్రైవర్స్‌తో వస్తోన్న ఈ బడ్స్‌ బ్లూటూత్‌ 5.4 కనెక్టివిటీతో పనిచేస్తుంది. గూగుల్‌ ఫాస్ట్‌ పెయిర్‌ ఫీచర్‌ ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే కేస్‌తో కలిపి 30 గంటల వరకు పని చేస్తుంది. 10 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే 90 నిమిషాల ప్లేటైమ్‌ ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటి ధర రూ.1,499. ఏప్రిల్‌ 29 నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ షావోమి రిటైల్‌ స్టోర్లలో లభిస్తాయి.

గార్మెంట్‌ స్టీమర్‌..

1,300 వాట్‌ పవర్‌తో షావోమి కొత్త గార్మెంట్‌ స్టీమర్‌ను తీసుకొచ్చింది. నిమిషానికి 24 గ్రాముల స్టీమ్‌ను స్థిరంగా విడుదల చేస్తుందని కంపెనీ తెలిపింది. అన్ని రకాల దుస్తుల ముడతలను తొలగించగలదని పేర్కొంది. 26 సెకన్లలోనే వేడెక్కుతుందని తెలిపింది. రూ.2,299 ధర వద్ద ఇది లభిస్తోంది. మే 6 నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, షావోమి రిటైల్‌ స్టోర్లలో దొరుకుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని