Nikhil Kamath: సొంతిల్లా..? అద్దె ఇల్లా? నిఖిల్ కామత్‌ సమాధానమిదే..

Nikhil Kamath: జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో సొంతిళ్లు కొనకపోవడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

Updated : 23 Feb 2024 23:06 IST

Nikhil Kamath | ఇంటర్నెట్‌డెస్క్‌: సొంతిల్లు కొనడం మంచిదా? అద్దె ఇంట్లో ఉండడం బెటరా? అనేది చాలామందికి ఉండే డౌట్‌. దీనిపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. సొంతింట్లో అయితే హాయిగా ఉండొచ్చని కొందరు.. పెద్ద మొత్తం పెట్టి ఇల్లు కొనుగోలు చేసే బదులు అద్దె ఇంట్లోనే ఉండడం మేలని ఇంకొందరు చెబుతుంటారు. పెరిగిన వడ్డీ రేట్లు, ఇళ్ల ధరలు అధికంగా ఉండడం కూడా ఇంటి కొనుగోలుకు వెనకడుగు వేయడానికి మరో కారణం. ఈ విషయంపై స్టాక్ బ్రోకరేజ్‌ సంస్థ జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌ (Zerodha's CEO Nikhil Kamath) ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు.

‘ప్రస్తుతం అద్దె ఇంట్లోనే ఉంటున్నా. భవిష్యత్‌లోనూ అలానే ఉండాలని అనుకుంటున్నా. నాకు ఉన్నది ఒకటే ఇల్లు. అందులో అమ్మానాన్న ఉంటున్నారు. భావోద్వేగపరంగా ఆ ఇల్లు తీసుకోవాల్సి వచ్చింది. నా విషయంలో మాత్రం సొంతింటిపై ఉన్న అభిప్రాయం మారదు. ఇల్లు కొనేందుకయ్యే మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేస్తే.. 10 లేదా 12శాతం రాబడి వస్తుంది. అందులో మూడు, నాలుగో వంతు మొత్తంతో నాలుగు ఇళ్లకు అద్దె కట్టొచ్చు. ఒకవేళ ఇంటిని కొని అద్దెకు ఇచ్చినా దానిద్వారా వచ్చే రాబడి చాలా తక్కువ. ఏవిధంగా చూసినా ఇల్లు కొనడంలో ఎలాంటి అర్థం లేదు’ అని కామత్‌ పేర్కొన్నారు.

పేటీఎం యూపీఐ ఐడీ సంగతి చూడండి.. NPCIని కోరిన ఆర్‌బీఐ

ముంబయిలో ఇంటిని కొనుగోలు చేయడం కంటే అద్దె ఇంట్లోనే ఉండడం మేలని గతంలో మాధురిదీక్షిత్, కృతిసనన్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులు చెప్పుకొచ్చారు. కామత్‌ అభిప్రాయంతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకించారు. ‘మనకు వచ్చే ఆదాయంలో 20 శాతం లోన్‌ చెల్లించి ఇంటిని కొనుగోలు చేయడం మంచి ఆలోచన’ అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు. అద్దె ఇంట్లో నచ్చినట్లుగా ఉండడం సాధ్యపడదని మరో నెటిజన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని