Zomato fee: జొమాటోలో ప్లాట్‌ఫామ్‌ ఫీజు పెంపు.. ‘ఇంటర్‌ సిటీ’ సేవలకు గుడ్‌బై

జొమాటో ఆహార పదార్థాల డెలివరీకి వసూలు చేసే ప్లాట్‌ఫామ్‌ ఫీజును రూ.5 పెంచింది. ఏప్రిల్‌ 20 నుంచే పెరిగిన ఫీజు అమల్లోకి వచ్చింది.

Updated : 22 Apr 2024 15:35 IST

Zomato platform fee | ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ ఫుడ్‌డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమటో (Zomato) ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచింది. ఇక నుంచి ప్రతి ఆర్డర్‌పై రూ.5 చొప్పున దీనిని వసూలు చేయనుంది. ఏప్రిల్‌ 20 నుంచే పెరిగిన ఫీజు అమల్లోకి వచ్చింది. దేశ రాజధాని ప్రాంతం, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌, లఖ్‌నవూ వంటి ప్రధాన మార్కెట్లలో ఇప్పటికే యూజర్ల నుంచి దీనిని వసూలు చేస్తోంది. మరో ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ ఇప్పటికే ఒక్కో డెలివరీకి రూ.5 చొప్పున వసూలు చేస్తోంది.

జొమాటో తొలిసారి 2023 ఆగస్టులో ప్లాట్‌ఫాం ఫీజును ప్రవేశపెట్టింది. తొలుత ఆర్డర్‌కు రూ.2 చొప్పున వసూలు చేసేది. అక్టోబర్‌లో దాన్ని రూ.3, జనవరిలో రూ.4కు పెంచింది. తాజాగా రూ.5కు చేర్చింది. సాధారణంగా ఫుడ్‌ డెలివరీ సంస్థలు ఆహారంతో పాటు డెలివరీ ఛార్జీని వసూలు చేస్తాయి. కంపెనీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్లాట్‌ఫామ్‌ ఫీజును కొత్తగా ప్రవేశపెట్టాయి. జొమాటోకే చెందిన బ్లింకిట్‌ ఈ ఫీజును రూ.2 చొప్పున వసూలు చేస్తోంది. ప్లాట్‌ఫామ్‌ ఫీజు పెంపు నేపథ్యంలో జొమాటో షేరు 2.22 శాతం లాభంతో రూ.193.40 వద్ద ముగిసింది.

క్వైట్‌ ఫైరింగ్‌.. పొమ్మనలేక పొగబెట్టడం..!

ఇంటర్‌ సిటీ సేవలకు స్వస్తి

ఇంటర్‌సిటీ లెజెండ్స్‌ పేరిట ఒక నగరంలో బాగా ప్రాచుర్యం పొందిన ఆహార పదార్థాలను ఇతర నగరాల్లోనూ సరఫరా చేసే సేవలను జొమాటో తాజాగా నిలిపివేసింది. ఊహించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సేవల విషయంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తడమూ మరో కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 తొలుత వీటిని ప్రారంభించిన జొమాటో.. తక్కువ సమయంలోనే డెలివరీ చేసేందుకు వీలుగా తమ గోదాముల్లో వీటిని ముందుగానే అందుబాటులో ఉంచుతోంది. దీనిపై దిల్లీకి చెందిన ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. దీనికి తోడు ఇంటర్‌సిటీ డెలివరీ సేవలకు సంబంధించిన హెడ్డ్‌ సిద్ధార్థ్‌ జవార్‌ కొద్ది నెలలకే బాధ్యతల నుంచి వైదొలగడమూ మరో కారణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని