Quiet Firing: క్వైట్‌ ఫైరింగ్‌.. పొమ్మనలేక పొగబెట్టడం..!

Quiet Firing: కార్పొరేట్‌ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్‌లలో క్వైట్‌ ఫైరింగ్‌ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..!

Updated : 23 Apr 2024 10:37 IST

Quiet Firing | ఇంటర్నెట్‌ డెస్క్‌: కొంత కాలంగా అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2024లోనూ అది కొనసాగుతోంది. ముఖ్యంగా టెక్‌ రంగంలో మరింత ఎక్కువగా ఉంది. ఆర్థిక అనిశ్చితులతో పాటు సాంకేతికంగా వచ్చిన అనేక కొత్త మార్పులే దీనికి కారణం. ఈ క్రమంలో కంపెనీలు ఉద్యోగులను తీసివేసే విషయంలో వివిధ పద్ధతులను అనుసరిస్తున్నాయి. కొన్ని నేరుగా తొలగిస్తే.. మరికొన్ని పరోక్షంగా ఉద్యోగులు వారికి వారే వైదొలిగేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిందే క్వైట్‌ ఫైరింగ్‌ (Quiet Firing).

ఏంటీ క్వైట్‌ ఫైరింగ్‌?

పొమ్మనలేక పొగబెట్టడం అనే సామెత వినే ఉంటారు! క్వైట్‌ ఫైరింగ్‌ (Quiet Firing) అంటే సరిగ్గా అదే. ఉద్యోగులను తీసేయాలనుకున్నప్పుడు.. కంపెనీలోని పరిస్థితులను యాజమాన్యాలు అసౌకర్యంగా మారుస్తాయి. నేరుగా పొమ్మని చెప్పలేక ఈ తరహా పద్ధతులను అనుసరిస్తుంటాయి. వసతులను తగ్గించడం, పనిలో ప్రాధాన్యం లేకుండా చేయడం, అధిక పనిభారం, పనిగంటలను పెంచడం, ఏమాత్రం అవగాహనలేని పనిని అప్పగించడం.. వంటివి చేస్తుంటాయి. ఫలితంగా ఉద్యోగికి విసుగు, చిరాకు పుట్టి తనకు తానే వైదొలిగే పరిస్థితులను సృష్టిస్తాయి.

ఒక్కోసారి ఉద్యోగులు చేసే ప్రతి పనిని వారి బాస్‌లు విమర్శిస్తుంటారు. ఏం పని చేసినా దానిపై నిఘా వేస్తారు. ఏమాత్రం పొరపాటు దొర్లినా స్పందించే తీరు చాలా కఠినంగా ఉంటుంటుంది. ఉద్యోగుల సంఖ్యను ఎలాగైనా తగ్గించాలని కంపెనీ నుంచి వచ్చే ఒత్తిడి మేరకే ఇలాంటి చర్యలు చేపడుతుంటారు. సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి.. ఇక చేసేది లేనప్పుడు ఇలాంటి పోకడలను అనుసరిస్తారు. తద్వారా సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు.

ఎందుకు ఇలా..

కంపెనీ తమ సిబ్బందిని తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఈ పద్ధతులను అనుసరిస్తుంటాయి. అయితే, నేరుగా లేఆఫ్‌ చేసే అవకాశం ఉంటుంది. కానీ, అలా చేస్తే నిబంధనల ప్రకారం.. కొన్ని రకాల పరిహారాలు చెల్లించాలి. అప్పటి వరకు ఉన్న బకాయిలను ఇచ్చేయాలి. లీవ్‌లు, ప్రోత్సాహకాలేమైనా మిగిలిపోయి ఉంటే వాటిని క్లెయిం చేసుకునే హక్కు ఉద్యోగికి ఉంటుంది. లీగల్‌గానూ సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకు కంపెనీలు క్వైట్‌ ఫైరింగ్‌ (Quiet Firing) వంటి పద్ధతులను అనుసరిస్తాయి.

డ్రై ప్రమోషన్‌.. జాబ్‌ మార్కెట్‌లో ఇదో కొత్త ట్రెండ్‌

ఎలా గుర్తించడం..

కొన్ని సంకేతాలను బట్టి ఒక ఉద్యోగి తనపై క్వైట్‌ ఫైరింగ్‌ (Quiet Firing) జరుగుతోందని గుర్తించొచ్చు. ప్రమోషన్లు-ఇంక్రిమెంట్లు ఆపడం, పనిభారం పెంచడం, పనివేళల్లో మార్పులు, వసతులను తగ్గించడం, ప్రోత్సాహకాలను కుదించడం, బోనస్‌లు ఆపేయడం, ఫీడ్‌బ్యాక్‌ తీసుకోకపోవడం, కీలక నిర్ణయాల్లో భాగస్వాములను చేయకపోవడం, సెలవులు నిరాకరించడం వంటి సంకేతాలను బట్టి క్వైట్‌ ఫైరింగ్‌ జరుగుతోందని గుర్తించొచ్చు.

తొందరపడొద్దు..

వీటిలో కొన్నింటిని గుర్తించినంత మాత్రాన.. కంపెనీ మిమ్మల్ని వదిలించుకోవాలి అనుకుంటుందనే నిశ్చితాభిప్రాయానికి రావాల్సిన అవసరం లేదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీలో ఏమైనా పరిమితులు ఉంటే వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. మీ బాస్‌తో మాట్లాడి పరిస్థితిని అంచనా వేయాలి. మొత్తంగా సంస్థకు మీరొక ‘అసెట్‌’గా మారేందుకు కృషి చేయాలి. మీవైపు ఏ పొరపాటు లేదని గుర్తిస్తే మాత్రం.. వెంటనే అప్రమత్తమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం మేలు!

నిజానికి క్వైట్‌ ఫైరింగ్‌ అనేది కొత్త కాన్సెప్ట్‌ ఏమీ కాదు. ఇలాంటి పద్ధతులు ఎప్పటి నుంచో రహస్యంగా అమలవుతూనే ఉన్నాయి. కానీ, ఇటీవల తొలగింపులు పెరగడం.. దానికి కార్పొరేట్‌ సంస్కృతిలోని కొత్త ధోరణులు తోడవ్వటంతో ఈ ట్రెండ్‌ ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతర్జాతీయ స్థాయి బడా సంస్థలు సైతం ఈ తరహా విధానాలను అవలంబిస్తున్నాయని కొన్ని ప్రముఖ సర్వేలు వెల్లడిస్తున్నాయి.

క్వైట్‌ హైరింగ్‌ కూడా ఉంది..

క్వైట్‌ ఫైరింగ్‌ తరహాలోనే క్వైట్‌ హైరింగ్‌ (Quiet Hiring) అనే ట్రెండ్‌ కూడా ఆ మధ్య వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త వారిని నియమించుకోకుండానే కంపెనీలోనే కావాల్సిన నైపుణ్యాలున్న వ్యక్తిని కనిపెట్టడాన్నే క్వైట్‌ హైరింగ్‌ (Quiet Hiring)గా వ్యవహరిస్తున్నారు. సంస్థలో అంతర్గతంగా ఇతర విభాగాల్లో ఉండే ఉద్యోగులను ఖాళీగా ఉన్న స్థానాల్లో భర్తీ చేయడమే ఈ కొత్త ట్రెండ్‌. ఉద్యోగుల కొరత ఉండి, టార్గెట్‌లు అందుకోవడానికి గడువు సమీపిస్తున్న సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని