ప్రాణాలు తీస్తున్న టమాటా ధర!

టమాటా రైతులకు కొత్త చిక్కులు వచ్చాయి. సాధారణంగా పంటకు ధర పెరిగితే ఆనందపడతారు..కానీ ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Published : 21 Jul 2023 06:08 IST

వారంలో ఇద్దరి రైతుల హత్య
తోటల్లో పంటను ఎత్తుకెళుతున్న దుండగులు
కాపలాగా వెళ్లలేక.. ఇంట్లో ఉండలేక ఆందోళనకు గురవుతున్న అన్నదాతలు

ఈనాడు, అమరావతి: టమాటా రైతులకు కొత్త చిక్కులు వచ్చాయి. సాధారణంగా పంటకు ధర పెరిగితే ఆనందపడతారు..కానీ ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తోటల్లోని పంటను ఎత్తుకెళ్లటం.. ఇద్దరు రైతులు హత్యకు గురికావటం వంటి పరిణామాలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. అరుదైన జపాన్‌ రకం మామిడి కాయ రూ.21 వేల ధర పలకడంతో.. మధ్యప్రదేశ్‌లో వాటిని సాగు చేసిన రైతు తోటలకు కాపలాగా గార్డులతోపాటు తొమ్మిది కుక్కలను పెట్టుకున్నారు. ఇటీవల మన రాష్ట్రంలోనూ మిరప క్వింటాల్‌ రూ.25 వేలకు పైగా పలికినప్పుడు..చోరులు కల్లాల్లో ఆరబెట్టిన మిరపను ఎత్తుకుపోవడంతో రాత్రింబవళ్లు కాపలా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు టమాటా కేజీ ధర రూ.150 పైగా పలుకుతుండటంతో అదే పరిస్థితి ఎదురవుతోంది. అన్నమయ్య జిల్లాలో వారం వ్యవధిలో ఇద్దరు టమాటా రైతులు హత్యకు గురవ్వడంతో తోటివారిలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరి హత్యలకు వేర్వేరు కారణాలున్నాయని పోలీసులు చెబుతున్నా.. ఆయా ప్రాంతాల్లోని రైతులు మాత్రం రాత్రిళ్లు పొలాల దగ్గరకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. పొలానికి వెళ్తే ఏమవుతుందో అనే భయం ఒకవైపు వెంటాడుతోంది. మరోవైపు విలువైన పంట పోతుందనే ఆందోళనతో కంటిమీద కునుకు కరవైంది. మదనపల్లి, మొలకలచెరువు తదితర ప్రాంతాల్లో ఒకరిద్దరు రైతులు కలిసి కాపలాగా వెళ్తున్నారు. విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్నిచోట్ల కుటుంబ సభ్యులంతా కలిసి రాత్రిపూట పొలాల దగ్గరకే కాపలాగా ఉంటున్నారు. కర్ణాటకలో ఇటీవలే రూ. 2.50 లక్షల విలువైన టమాటాను దొంగలించారు. మన రాష్ట్రంలోనూ ఇటీవల రెండుచోట్ల దొంగతనాలు జరిగాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నెక్కుందిలో ఉదయ్‌ అనే రైతు పొలం నుంచి రూ.50 వేల విలువైన టమాటాలు కోసుకెళ్లారు. మూడు రోజుల కిందట పెద్ద తిప్ప సముద్రం మండలంలోనూ 6 క్వింటాళ్ల కాయలు ఎత్తుకెళ్లారు. మరికొన్ని చోట్ల కూడా చోరీలు జరిగాయి. దీంతో టమోటాలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.  

కొద్ది రోజుల్లోనే రూ.కోట్లు

మహారాష్ట్రలో 12 ఎకరాల్లో టమాటా సాగు చేసిన రైతుకి 18వేల క్రేట్ల(ఒక్కోటి 20 కిలోలు) అమ్మకం ద్వారా సుమారు రూ.3కోట్ల ఆదాయం లభించింది. ఆయనకు జూన్‌ 11న కిలోకు రూ.37 నుంచి రూ.38 చొప్పున రాగా.. జులై 18న రూ.110 లభించింది. ఇదే రైతు 2021 సంవత్సరంలో టమాటా సాగులో రూ.16 లక్షల వరకు నష్టపోయారు. కిలోకు రూ.2.50 ధర మాత్రమే లభించింది. గతంతో పోలిస్తే ఆదాయం 700% శాతం పెరిగింది. రాష్ట్రంలోనూ ప్రస్తుతం టమాటా పంట చేతికొస్తున్న రైతులకు.. రూ.లక్షల్లో ఆదాయం లభిస్తోంది. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల రైతులకు కిలోకు రూ.100 నుంచి రూ.120 వరకు దక్కుతోంది.

దుబాయ్‌ నుంచి టమాటాలు తీసుకురా!

‘అమ్మా? దుబాయ్‌ నుంచి నీకేం తీసుకురమ్మంటావ్‌..’ అని అడిగిన కుమార్తెకు పది కిలోల టమాటాలు తీసుకురమ్మని చెప్పిందా తల్లి. బుధవారం ట్విటర్‌లో ఇదొక సంచలన వార్తగా మారింది. దుబాయ్‌లో టమాటా ధర రూ.99 (4.45 దిర్హాం)వరకు ఉంది. ట్విటర్‌లో ఈ విషయాన్ని ఉంచిన కొద్ది సేపట్లోనే వేలాది మంది వీక్షించడం గమనార్హం.

  • దేశంలో టమాటాల ధర ఎక్కువగా ఉండటంతో.. వాటి కోసం వినియోగదారులు సరిహద్దులు దాటి పొరుగు దేశాలకు వెళ్లేందుకు కూడా వెనకాడటం లేదు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పిఠోరాఘర్‌ ప్రాంతంలో కిలో టమాటా రూ.120పైగా ఉండటంతో.. అక్కడి ప్రజలు సమీపంలోని నేపాల్‌కు వెళ్లి  కొనుగోలు చేస్తున్నారు. నేపాల్‌లో టమాటా కిలో రూ.60 నుంచి రూ.75 వరకు ఉంది. నేపాల్‌ నుంచి భారత్‌కు కూరగాయల దిగుమతులపై నిషేధం ఉన్నా.. దేశంలోకి అనుమతించడంతో సంబంధిత ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు.
  • కూరగాయల దుకాణ వార్షికోత్సవం సందర్భంగా తమిళనాడులోని కడలూరుకు చెందిన చెందిన వ్యాపారి ఒకరు.. వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు కిలో టమాటా రూ.20 చొప్పున పంపిణీ చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని