Kerala: చిట్టితల్లీ.. మన్నించమ్మా!

రెండు రోజుల కిందటిదాకా అదే పాఠశాలలో ఆ చిన్నారి (5) పాఠాలు వల్లె వేసింది. ఆ ఆవరణలోనే తోటి పిల్లలతో కలిసి ఆడుకొంది. ఇపుడు అదేచోట విగతజీవిగా పడున్న ఆ పసిపాపకు వందలాదిగా తరలివచ్చిన జనం కన్నీటి వీడ్కోలు పలికారు.

Updated : 31 Jul 2023 07:43 IST

కామాంధుడి చేతిలో బలైన బాలికకు కన్నీటి వీడ్కోలు
వలస కార్మికుల నమోదుకు చట్టం తెస్తామన్న కేరళ సర్కారు

కొచిన్‌: రెండు రోజుల కిందటిదాకా అదే పాఠశాలలో ఆ చిన్నారి (5) పాఠాలు వల్లె వేసింది. ఆ ఆవరణలోనే తోటి పిల్లలతో కలిసి ఆడుకొంది. ఇపుడు అదేచోట విగతజీవిగా పడున్న ఆ పసిపాపకు వందలాదిగా తరలివచ్చిన జనం కన్నీటి వీడ్కోలు పలికారు. బిహార్‌ వలస కుటుంబాలకు చెందిన ఈ చిన్నారిని అదే సమూహంలోని ఓ కామాంధుడు కాటేశాడు. అభం శుభం తెలియని పాపను శుక్రవారం రాత్రి కిడ్నాప్‌ చేసి, మద్యం మత్తులో తన పైశాచిక కోరిక తీర్చుకొని గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని ఓ గోనెసంచిలో కుక్కి, చిత్తడిగా ఉన్నచోట చెత్తలో పడేశాడు. కొచిన్‌ సమీప అలువాలో ఈ దుర్ఘటన జరిగింది. ఆదివారం ఉదయం పాఠశాల ఆవరణలో ఉంచిన బాలిక మృతదేహానికి నివాళులు అర్పించేందుకు తరలివచ్చిన పలువురు తల్లులు, విద్యార్థులు ‘‘ఈ హత్యకు కారకుడైన నిందితుణ్ని కూడా ఇలాగే చంపాలి. అది ప్రభుత్వం వల్ల కాదు. మాకు అప్పగించండి’’ అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు అష్ఫాక్‌ ఆలంను సోమవారం పోక్సో ప్రత్యేక న్యాయస్థానం విచారించనుంది. బాలిక హత్య పోలీసుల వైఫల్యమంటూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి, భాజపా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కేరళలో రాజకీయ దుమారం రేపుతున్న ఈ ఘటనపై ప్రజల్లోనూ పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం స్పందించింది. వలస కార్మికుల నమోదు తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకువస్తామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వి.శివన్‌కుట్టి ఆదివారం ఓ ప్రకటన చేశారు.

సిగ్గుపడుతున్నా: గవర్నర్‌

అలువాలో బిహార్‌ వలస కుటుంబంలోని చిన్నారి హత్యాచారానికి గురైన ఘటనపై కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ ఆదివారం దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. ఎంతో బాధపడుతున్నా.. సిగ్గుపడుతున్నా. భవిష్యత్తులో మరెవరూ ఇలా చేయకుండా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలి’’ అన్నారు.

క్షమాపణలు కోరిన కేరళ పోలీస్‌

బాలికను కాపాడలేకపోయామంటూ కేరళ పోలీసులు చిన్నారి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. ఎంత ప్రయత్నించినా బాలికను క్షేమంగా ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చలేకపోయామంటూ తమ సామాజిక మాధ్యమ హ్యాండిల్స్‌లో వారు పోస్టులు పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని