క్షణికావేశంలో ఆత్మహత్యలు.. ముగ్గురు పాఠశాల విద్యార్థుల మృతి

బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన పాఠశాల విద్యార్థులు... క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపారు.

Updated : 02 Aug 2023 07:42 IST

విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఘటనలు

విశాఖపట్నం, పెనమలూరు - న్యూస్‌టుడే : బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన పాఠశాల విద్యార్థులు... క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపారు. కృష్ణా, విశాఖ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆయా ఘటనలకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారు తెలిపిన ప్రకారం..

తల్లిదండ్రులు మందలించారని..: విశాఖలోని గాజువాకలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో బాలుడు(15) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న బాలికతో ప్రేమ వ్యవహారం సాగిస్తుండడంతో అతడి తల్లిదండ్రులు మందలిస్తుండేవారు. మనస్తాపం చెందిన బాలుడు.. మంగళవారం వంటగదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి జేబులో ఉన్న లేఖలో ‘ఓయ్‌..! నువ్వు నాతో ఉన్నప్పుడు నాకు ఇంకెవరూ వద్దనిపిస్తుంది..! నువ్వు నాతో లేనప్పుడు నాకంటూ ఎవరూ లేరనిపిస్తుంది..’ అని రాసుంది.

ఉపాధ్యాయులు మందలించారని...: విద్యార్థిని విషయంలో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఉపాధ్యాయులు మందలించడంతో ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా కానూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని విషయంలో రెండు రోజుల క్రితం అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఇది ఉపాధ్యాయుల దృష్టికి రావడంతో బాలుడికి సోమవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి అదే రోజు సాయంత్రం పాఠశాల భవనం నాలుగో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేశాడు. బాధితుణ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు.

అనారోగ్య కారణాలతో..: విశాఖ నగర పరిధి చంద్రనగర్‌కు చెందిన పదో తరగతి బాలుడు(15), అతడి సోదరి తాతయ్య ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నారు. పిల్లల తల్లిదండ్రులు మహారాష్ట్రలో నివాసం ఉంటున్నారు. బాలుడు నాలుగు రోజుల నుంచి నీరసంగా ఉందంటూ పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు నిద్ర లేచేసరికి పడక గది తలుపు బిగించుకుని, ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్నాడు. గోపాలపట్నంలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని