పుట్టిన రోజు నాడే చివరిరోజైంది

అప్పటిదాకా ఎంతో సంతోషంగా పుట్టినరోజు నిర్వహించుకున్న ఆ చిన్నారి అనుకోని ప్రమాదంలో మృతి చెందింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

Published : 23 Sep 2023 05:28 IST

బండ విరిగిపడి ప్రైవేటు పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారి మృతి

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: అప్పటిదాకా ఎంతో సంతోషంగా పుట్టినరోజు నిర్వహించుకున్న ఆ చిన్నారి అనుకోని ప్రమాదంలో మృతి చెందింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, బాలిక తండ్రి చెప్పిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని అంకాలమ్మ గుడి ప్రాంతంలో ఉంటున్న రంగయ్య, శిరీష దంపతులకు కీర్తన, అభిరామ్‌, కేశవ్‌ సంతానం. పెద్ద కుమార్తె కీర్తన(4) స్థానికంగా శ్రీ విద్య ఇంగ్లిష్‌ మీడియం స్కూలులో ఎల్‌కేజీ చదువుతోంది. ఆ పాఠశాలను చుట్టూ బండలతో కట్టిన రేకుల షెడ్లలో నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఆ చిన్నారి పుట్టిన రోజు కావడంతో తల్లిదండ్రులు కొత్త దుస్తులు తొడిగి, ఆలయానికి తీసుకువెళ్లి పూజలు చేయించారు. అనంతరం పాఠశాలలో అందరికీ చాకెట్లు పంచింది. మధ్యాహ్నం ఇంటికి రాగా.. తల్లి దుస్తులు మార్చి కుమార్తెను తిరిగి పాఠశాలలో వదిలిపెట్టింది. అనంతరం 3.30 గంటల సమయంలో తరగతి గదిలో ఆ పాప నిద్రపోగా తలపై బండ విరిగిపడంతో తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న ఉపాధ్యాయులు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు చెప్పారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. పాపకు ప్రమాదం జరిగినా ఉపాధ్యాయులు సమాచారం ఇవ్వలేదని, పిల్లలు వచ్చి చెప్పేంత వరకు విషయం తెలీదని తండ్రి రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రెండో పట్టణ సీఐ గణేష్‌ ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని