దళిత యువకుడి ప్రాణం తీసిన ఫ్లెక్సీ వివాదం: పోలీసుల తీరుపై ఆరోపణలు.. ఎస్‌ఐ సస్పెన్షన్‌

వైకాపా ఫ్లెక్సీ చిరిగిన వివాదం ఓ దళిత యువకుడి ఆత్మహత్యకు దారితీసిన ఘటన హోం మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో జరిగింది.

Updated : 16 Nov 2023 07:22 IST

మృతదేహాన్ని తీసుకొస్తుండగా రాళ్ల దాడి.. అదనపు ఎస్పీకి గాయాలు
హోం మంత్రి ఇలాకాలో ఘటన

కొవ్వూరు పట్టణం, చాగల్లు, న్యూస్‌టుడే: వైకాపా ఫ్లెక్సీ చిరిగిన వివాదం ఓ దళిత యువకుడి ఆత్మహత్యకు దారితీసిన ఘటన హోం మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... కొవ్వూరు మండలం దొమ్మేరులో ఈ నెల 6న ‘గడప గడపకు మన ప్రభుత్వం’  కార్యక్రమానికి హోం మంత్రి వస్తున్నారని నాయకులు నాగరాజు, సతీష్‌ తదితరులు ఫ్లెక్సీలు కట్టారు. ఓ ఫ్లెక్సీలో నాగరాజు, సతీష్‌ ముఖాలున్న భాగాన్ని ఎవరో కత్తిరించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 13న కొవ్వూరు పట్టణ ఎస్‌ఐ భూషణం దొమ్మేరు వెళ్లారు. బొంతా మహేంద్ర (23) అనే యువకుడి గురించి జడ్పీటీసీ సభ్యురాలు బొంతా వెంకటలక్ష్మి భర్త పోశిబాబుకు ఫోన్‌ చేసి ఆరా తీశారు.

పోశిబాబు అన్న కుమారుడైన మహేంద్ర వైకాపాలోనే ఉన్నారు. పోశిబాబు సూచనతో మహేంద్ర కొవ్వూరు స్టేషన్‌కు వెళ్లారు. ఫ్లెక్సీ విషయమై ఎస్‌ఐ అతడిని ప్రశ్నించారు. కుటుంబసభ్యులు, మద్దతుదారులు స్టేషనుకు రావడంతో సాయంత్రం విడిచిపెట్టారు. ఇంటికి వెళ్లిన మహేంద్ర మనస్తాపంతో మంగళవారం తెల్లవారుజామున పురుగులమందు తాగారు. విజయవాడ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మృతిచెందారు. మృతదేహాన్ని దొమ్మేరు తీసుకొచ్చే క్రమంలో గ్రామంలోని దళిత యువత ఆగ్రహిస్తూ పెద్దఎత్తున ఉద్యమించింది. పోలీసులు వారిని సముదాయించారు. రాత్రి 10.30కు గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులపైకి సీసాలు, రాళ్లను విసిరారు. ఈ ఘటనలో అదనపు ఎస్పీ (క్రైమ్‌) గోగుల వెంకటేశ్వరరావు తలకు గాయమైంది. ఆయన్ను కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు లాఠీలు ఝుళిపించి గుంపును చెదరగొట్టారు.

మహేంద్ర పరిస్థితిని జడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి... హోం మంత్రికి చెప్పినా స్పందించలేదని, అందుకు నిరసనగా అతని మృతదేహాన్ని హోం మంత్రి పాల్గొంటున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం వద్దకు తీసుకెళ్లాలని బాధిత కుటుంబీకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ, మరో ఇద్దరు నాయకులపై మృతుడి సోదరుడు రమేష్‌ ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్‌ఐ భూషణంను ఏలూరు డీఐజీ అశోక్‌కుమార్‌ సస్పెండ్‌ చేసినట్లు ఎస్పీ పి.జగదీష్‌ బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు