ట్రేడ్‌ లైసెన్సుల పేరిట వ్యాపారులకు బురిడీ

మీ వ్యాపార ట్రేడ్‌ లైసెన్సులు రెన్యువల్‌ చేసుకోవాలంటూ పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసిన అంతర్రాష్ట్ర సైబర్‌ మోసగాడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు.

Published : 29 Apr 2024 04:11 IST

ప్రభుత్వ అధికారినంటూ ఫోన్లు చేసి డబ్బు వసూలు
అంతర్రాష్ట్ర సైబర్‌ మోసగాడిని అరెస్టు చేసిన గద్వాల పోలీసులు

గద్వాల అర్బన్‌, న్యూస్‌టుడే: మీ వ్యాపార ట్రేడ్‌ లైసెన్సులు రెన్యువల్‌ చేసుకోవాలంటూ పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసిన అంతర్రాష్ట్ర సైబర్‌ మోసగాడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. గద్వాల సీఐ భీంకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని వైయస్‌ఆర్‌ జిల్లా బి.కోడూరు మండలం రామచంద్రాపురానికి చెందిన బిల్ల నాగేశ్వరరావు 2019లో రెండు నెలలపాటు అక్కడి బద్వేల్‌ పురపాలక కార్యాలయంలో తాత్కాలిక క్లర్క్‌గా విధులు నిర్వహించాడు. వ్యాపారాలకు సంబంధించిన ట్రేడ్‌ లైసెన్సుల అనుమతి, వాటి రెన్యువల్‌ గురించి అవగాహన పెంచుకున్నాడు. దీని ఆధారంగా అడ్డదారిలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. మున్సిపల్‌ కమిషనర్‌ను అంటూ వ్యాపారులకు ఫోన్లు చేస్తూ దందాకు తెర తీశాడు. నెల రోజుల క్రితం గద్వాల పరిసర ప్రాంతాల్లో బత్తాయి తోటల్లో కూలీ నిమిత్తం వచ్చాడు. అక్కడే తిష్ఠ వేసిన నాగేశ్వరరావు స్థానికంగా ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లు, క్లినిక్‌లను పరిశీలించి వాటి బోర్డులపై ఉన్న ఫోన్‌ నంబర్లు సేకరించాడు. అనంతరం ఓ ఫుడ్‌ కోర్టుకు ఫోన్‌ చేసి.. త్వరగా మీ ట్రేడ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకోవాలని, డబ్బులు తనకు ఫోన్‌ పే చేస్తే తమ సిబ్బంది పని పూర్తి చేసి ధ్రువపత్రాలు తెచ్చిస్తారని చెప్పడంతో నిర్వాహకులు రూ.3,420 పంపారు. మరుసటి రోజు మళ్లీ మాయమాటలు చెప్పి మరో రూ.3,600 తీసుకున్నాడు.తమ సిబ్బంది వచ్చి ధ్రువపత్రాలు ఇస్తారని, వారికి రూ.500 చెల్లించాలని సందేశం పంపడంతో అనుమానం వచ్చిన నిర్వాహకులు ఫోన్‌ చేసి నాగేశ్వరరావును నిలదీయడంతో వారి నంబరును బ్లాక్‌ చేశాడు. దీంతో నిర్వాహకులు అదే రోజు సైబర్‌ క్రైం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో గద్వాల పట్టణ ఠాణాలో కేసు నమోదైంది. సీఐ భీంకుమార్‌ విచారణ ప్రారంభించి సాంకేతిక ఆధారంగా నిందితుడు గద్వాల కొత్తబస్టాండు పరిసరాల్లో ఉన్నట్టు గుర్తించి శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసుల విచారణలో గద్వాల, హైదరాబాద్‌, సైబరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, ఏపీలోని ప్రకాశం, అనంతపురం, వైయస్‌ఆర్‌, బద్వేల్‌ తదితర ఠాణాల పరిధిలో ఇదే తరహా సైబర్‌ నేరాలకు పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని