Unnao: యువతి మృతదేహం లభ్యం.. సమాజ్‌వాదీ నేతపై అనుమానం..!

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. రెండు నెలల క్రితం కనిపించకుండా పోయిన ఓ దళిత యువతి (22) కథ చివరకు విషాదాన్ని మిగిల్చింది.

Published : 12 Feb 2022 02:12 IST

మాజీ మంత్రి కుమారుడే హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ

ఉన్నావ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. రెండు నెలల క్రితం కనిపించకుండా పోయిన ఓ దళిత యువతి (22) కథ విషాదాంతమైంది. ఇప్పటివరకు అపహరణకు గురైనట్లు భావిస్తుండగా.. ఆ యువతి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఫతే బహదూర్‌ సింగ్‌ నిర్మించిన ఓ ఆశ్రమం సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో యువతి మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో ఫతే బహదూర్‌ కుమారుడు రాజోల్‌ సింగ్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆయనను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

‘రిమాండ్‌లో ఉన్న నిందితుడు రాజోల్‌ సింగ్‌ను విచారించాం. అనంతరం మహిళ మృతదేహాన్ని గుర్తించాం. వారి ఆశ్రమం సమీపంలోని స్థలంలో మృతదేహాన్ని పూడ్చివేశారు. స్థానిక నిఘా బృందాలు, పోలీసు పర్యవేక్షణ సహాయంతో పూడ్చివేసిన స్థలాన్ని కనుగొన్నాం’ అని ఉన్నావ్‌ అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్‌ శశిశేఖర్‌ సింగ్‌ వెల్లడించారు. వివాహేతర సంబంధం కోణం ఉండవచ్చంటూ వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదన్న ఆయన.. పూర్తి దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారందరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.

బాధిత తల్లి ఆత్మహత్యాయత్నంతో.

ఉన్నావ్‌కు చెందిన దళిత యువతి (22) డిసెంబర్‌ 8న కనిపించకుండా పోయింది. దీంతో మాజీ మంత్రి కుమారుడు రాజోల్‌ సింగ్‌ తన కూతురిని అపహరించాడంటూ ఆరోపిస్తూ బాధిత తల్లి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజోల్‌పై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీసులతో పాటు పోలీసు ఉన్నతాధికారులను వేడుకుంది. రోజులు గడుస్తున్నప్పటికీ తన కూతురి జాడ తెలియకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. చివరకు జనవరి 24న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఇంటిముందు ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ ఘటనతో మేల్కొన్న పోలీసులు.. అదే రోజు రాజోల్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. బాధిత తల్లి భయపడినట్లుగానే చివరకు ఆమె కుమార్తెకు జరగకూడని ఘోరం జరిగిపోయింది.

ఎస్‌పీ మండిపడ్డ మాయావతి..

స్‌పీ నేతకు చెందిన ఆశ్రమం సమీపంలోనే దళిత యువతి మృతదేహం లభ్యం కావడం పట్ల బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి ఆ పార్టీపై మండిపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శించారు. ఈ ఘటనలో నిందితులకు కఠినశిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అపహరణ, హత్యకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు ఎస్‌పీ నేతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని.. ఆ దిశగా దర్యాప్తు, చర్యలు చేపట్టాలన్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts