Nagar Kurnool: తీర్థం పేరిట నోట్లో యాసిడ్‌ పోసి.. 11 మందిని పొట్టన పెట్టుకున్నాడు!

తాంత్రిక పూజలతో గుప్త నిధులు సేకరిస్తానని నమ్మించి 11 మందిని పొట్టనపెట్టుకున్న వ్యక్తిని పోలీసుల అరెస్ట్‌ చేశారు.

Updated : 12 Dec 2023 17:22 IST

నాగర్‌కర్నూల్‌: తాంత్రిక పూజలతో గుప్త నిధులు సేకరిస్తానని నమ్మించి 11 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తిని పోలీసుల అరెస్ట్‌ చేశారు. నిందితుడిని నాగర్‌ కర్నూల్‌లోని ఇంద్రానగర్‌ కాలనీకి చెందిన రామటి సత్యనారాయణ (47)గా గుర్తించారు. ఈ మేరకు గద్వాల జోన్‌ డీఐజీ ఎల్‌.ఎస్‌.చౌహాన్‌ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు.

డీఐజీ ఎల్‌.ఎస్‌.చౌహాన్‌ మాట్లాడుతూ.. ‘‘నిందితుడు గుప్త నిధుల పేరుతో నమ్మించి 11 మందిని కిరాతంగా హతమార్చాడు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో ఈ హత్యలు చేశాడు. తాంత్రిక పూజలు చేసి గుప్త నిధులు సేకరిస్తానని అమాయకులను నమ్మించేవాడు. వారి నుంచి డబ్బు తీసుకోవడంతో పాటు స్థలాలు, భూములు రాయించుకునేవాడు. ఆ తర్వాత నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి హతమార్చేవాడు. వనపర్తి, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, కల్వకుర్తి.. కర్ణాటకలోని బలగనూరు, ఏపీలోని అనంతపురంలో ఈ హత్యలు జరిగాయి. తీర్థం పేరుతో నోటిలో యాసిడ్‌ పోసి చంపేవాడు. నిందితుడి నుంచి కారుతో పాటు మొబైల్‌ ఫోన్లు, సిమ్‌కార్డులు, విష పదార్థాలు, ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నాం. నిందితుడి ఆస్తులపై దర్యాప్తు చేపడతాం. ఇలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని డీఐజీ సూచించారు.

వెలుగులోకి ఇలా..

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి వెంకటేశ్‌ హైదరాబాద్‌లోని బొల్లారంలో నివసించేవారు. నవంబరులో నగర శివారులో అతను హత్యకు గురయ్యాడు. వెంకటేశ్‌ కుటుంబసభ్యులతో నిందితుడికి కొంతకాలంగా పరిచయం ఉండటంతో అనుమానం వచ్చి అదే నెల 26న నాగర్‌కర్నూల్‌ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. వెంకటేశ్‌ వద్ద నిందితుడు డబ్బులు తీసుకొన్న అనంతరం క్షుద్రపూజల పేరుతో హత్య చేసినట్లు గుర్తించారు. దీని ఆధారంగా తీగ లాగడంతో ఇదే తరహాలో అనేక హత్యలు చేసినట్లుగా వెల్లడైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని