Sangareddy: పూజల పేరుతో మోసం.. బంగారం కోసం హత్య

బంగారం కోసం మహిళను బండరాయితో మోది హత్య చేసిన నిందితుడు 40 రోజుల తర్వాత పోలీసులకు చిక్కాడు.

Published : 23 Mar 2024 21:13 IST

సంగారెడ్డి: సమస్యలు తీరాలంటే పూజలు చేయాలని మాయమాటలు చెప్పి.. ఓ మహిళను దొంగ స్వామి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారాన్ని తీసుకోబోయాడు. ప్రతిఘటించడంతో బండరాయితో మోది హత్య చేసి పరారయ్యాడు. ఈ కేసును దాదాపు 40 రోజుల తర్వాత గుమ్మడిదల పోలీసులు ఛేదించారు. 

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్నగూడెంకు చెందిన బుచ్చమ్మ.. బొంతపల్లిలో ఉన్న వీరభద్ర స్వామి దేవాలయానికి వెళ్లేది. కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమెకు.. అదే ఆలయానికి వచ్చిన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం వెంకిర్యాలకు చెందిన నర్సింగరావు అలియాస్ శివ పరిచయమయ్యాడు. స్వామీజీలా కనిపించడంతో బుచ్చమ్మ ఆమె కుటుంబంలోని సమస్యలు చెప్పింది.

దీంతో దొంగ స్వామి నర్సింగరావు కొన్ని పూజలు చేస్తే సమస్యలు తీరుతాయని మాయమాటలు చెప్పాడు. బుచ్చమ్మను సికింద్రాబాద్‌ తీసుకెళ్లి పూజకు కావల్సిన సామగ్రి కొనుగోలు చేశాడు. అనంతరం ఘట్‌కేసర్‌ పరిధిలోని మాదారం గ్రామ శివారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. గుమ్మడికాయ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ వేసి పూజలు చేస్తూ ఆమె మెడలోని బంగారాన్ని తీసుకోబోయాడు. ప్రతిఘటించడంతో బండ రాయితో మోది హత్య చేసి, బంగారం తీసుకుని పరారయ్యాడు. అనంతరం గుమ్మడిదల పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. నిందితుడు నర్సింగరావును అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని