logo

విద్యార్థులు కాలినడకన.. ప్రయాణికులు ఆటోల్లో..

జిల్లాలోని 59 గ్రామాలకు రోడ్డు సౌకర్యం అనుకూలంగా ఉన్నా ఆర్టీసీ బస్సు సౌకర్యంలేదు. దీంతో విద్యార్థులు నిత్యం నడుచుకుంటూ, సైకిళ్లు, ఆటోలపై పాఠశాలలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

Published : 14 Dec 2021 02:32 IST

బస్సు సౌకర్యంలేక ఇబ్బందులు

భూపాలపల్లి మండలం దూదేకులపల్లి, పందిపంపులకు బస్సు లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో కిక్కిరిసి వెళ్తున్నారు. గొల్లబుద్దారం ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లాల్సిందే.

భూపాలపల్లి నుంచి కాటారం మండలం రుద్రారంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ వరకు ఆర్టీసీ బస్‌ సౌకర్యం కల్పించాలని డిపో ముందు కొన్నేళ్లుగా విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. బస్సు లేకపోవడంతో భూపాలపల్లి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలిటెక్నిక్‌కు విద్యార్థులు సమయానికి చేరుకోలేకపోతున్నారు. కొందరు విద్యార్థులు బొగ్గు, ఇసుక రవాణా లారీలపైనే ప్రయాణిస్తున్నారు.

మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన విద్యార్థులు మొట్లపల్లి గ్రామంలోని హైస్కూల్‌కు నిత్యం సైకిళ్లపై వెళ్తున్నారు.

న్యూస్‌టుడే, భూపాలపల్లి

జిల్లాలోని 59 గ్రామాలకు రోడ్డు సౌకర్యం అనుకూలంగా ఉన్నా ఆర్టీసీ బస్సు సౌకర్యంలేదు. దీంతో విద్యార్థులు నిత్యం నడుచుకుంటూ, సైకిళ్లు, ఆటోలపై పాఠశాలలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వివిధ అవసరాల నిమిత్తం వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మేరకు జిల్లాలో బస్సు సౌకర్యం లేని గ్రామాల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ‘న్యూస్‌టుడే’ బృందం సోమవారం పరిశీలించింది.

బస్సు సర్వీసు రద్దయిన గ్రామాలు

* భూపాలపల్లి మండలం కాశీంపల్లికి గతంలో పరకాల డిపోకు చెందిన రెండు బస్సులు నడిచేవి. ఇందులో ఒక ఎక్స్‌ప్రెస్‌ కాశీంపల్లి నుంచి హైదరాబాద్‌కు, మరొకటి పరకాల వరకు నడిచేవి. వీటిని కాశీంపల్లి, సెగ్గంపల్లి, గడ్డిగానిపల్లి, జంగేడు, వేశాలపల్లి ప్రజలు వినియోగించుకునేవారు. పదేళ్ల నుంచి బస్సులు రద్దు కావటంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడుతున్నారు.

* పెద్దపల్లి జిల్లా మంథని డిపో నుంచి ఉదయం, సాయంత్రం కాటారం, భూపాలపల్లి మీదుగా మల్హర్‌ మండలం నాచారం, అనుసాన్‌పల్లి నుంచి భూపాలపల్లి మండలం గొర్లవీడు వరకు బస్సు సౌకర్యం కల్పించారు. జయశంకర్‌ జిల్లాలో మల్హర్‌ విలీనం కావటంతో రద్దు చేశారు.

* రేగొండ మండలంలోని జూబ్లినగర్‌, దమ్మన్నపేట, రాయపల్లి, కనిపర్తి గ్రామాలకు గతంలో బస్సు సౌకర్యం ఉంది. గతేడాది నుంచి రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు, విద్యార్థులు ప్రైవేటు వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారు.

* మహదేవపూర్‌ మండలంలోని ఎన్కపల్లి, రాపెల్లికోట, కిష్టరావుపేట గ్రామాల నుంచి విద్యార్థులు సూరారం ప్రభుత్వ పాఠశాల, మహదేవపూర్‌లోని జూనియర్‌, డిగ్రీ కళాశాలకు వెళ్లడానికి ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

* బస్సు సౌకర్యం లేకపోవడంతో మహాముత్తారం మండలంలోని దొబ్బలపాడు ప్రభుత్వ ఆదర్శ పాఠశాల నుంచి కొర్లకుంట, కాటారం మండలం చింతకాని, పోతులువాయి విద్యార్థులు ఇంటికి చేరాలంటే రాత్రి 8గంటలు అవుతుంది.

203 నిర్ధారణ పరీక్షలు

భూపాలపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 203 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం చేసిన నిర్ధారణ పరీక్షలలో ఎవరికి పాజిటివ్‌ రాలేదని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. ఎవరికైనా కొవిడ్‌ లక్షణాలు ఉంటే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

వెయ్యి పైగా జనాభా, రోడ్డు ఉన్నా బస్సు సౌకర్యం లేని గ్రామాల సంఖ్య

భూపాలపల్లి 4

మహదేవపూర్‌ 5

గణపురం 4

పలిమెల 3

చిట్యాల 8

టేకుమట్ల 5

మహాముత్తారం 5

మొగుళ్లపల్లి 4

రేగొండ 12

కాటారం 5

మల్హర్‌ 4

ట్వీట్‌ చేస్తే చాలు

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రతి గురువారం ‘బస్‌ డే’ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఊరికి బస్సు సౌకర్యం కావాలనుకునేవారు, వివాహాలు, విహార యాత్రలు, రైతుల ధాన్యం తరలింపు ఏ అవసరానికైనా/R@tsrtcmdoffice ట్వీటర్‌ ఖాతాకు ట్వీట్‌ చేస్తే చాలు. మీ వద్దకే బస్సు వస్తుంది.


డిపో పరిధిలో నిత్యం 38 రూట్లలో బస్సులు 34,900 కిలోమీటర్ల వరకు తిప్పుతున్నారు. సగటున్న రోజువారీ ఆదాయం రూ.11 లక్షల వరకు ఉంటుంది.

మొతం బస్సులు - 76

సంస్థ - 52

అద్దె - 24

ఎక్స్‌ప్రెస్‌ - 17

డీలక్స్‌ - 01

హైటెక్‌ - 11

పల్లెవెలుగు-23

సిబ్బంది - 340


వీసీ సజ్జనార్‌ గారూ.. మీరు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా బాధ్యతలు స్వీకరించాక ఆర్టీసీ సర్వీసుల్లో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. ఎన్నో గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థులు, ప్రజల ఇబ్బందులు తీరుస్తున్నారు. మా జిల్లాలో కూడా బస్సులు లేని గ్రామాలకు నూతన సర్వీసులను కల్పించి మా బాధలు తీర్చాలని కోరుతున్నాం.

- జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రజలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని